శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శంకరభట్టు, ధర్మగుప్తుడు త్రిపురాంతకం లో భాస్కరశాస్త్రి అనే అర్చకుడుని కలిసి, అతడు షోడశీ రాజరాజేశ్వరీ దేవిని ఆరాధించు పరమభక్తుడు అని తెలుసు కొనిరి. శంకరభట్టు: అయ్యా! శ్రీ రాజరాజేశ్వరీ దేవి వైభవమును గూర్చి మాకు వివరింపుడు.
భాస్కరశాస్త్రి: నాయనలారా! రాజరాజేశ్వరీ చైతన్యము ఆలోచించే మన మనస్సునకు, మన ఇచ్చ పైన ఉన్న విశాలమైన సీమలో ఆసీనురాలై ఉండును. ఆమె చేయు శుద్ధి కార్యక్రమము ఏమనగా, మనము ఆలోచించే మనస్సు సాధారణముగా మేధాశక్తిగా మారిపోవు చుండును.
ఆ మనస్సును ఆ విధముగా కాకుండా వివేకముగా మారుటకు ఆ మహాతల్లి మనకు సహకరించును. మనకున్న ఇచ్చ సంకుచిత పరిధులను వీడనాడి చక్కటి విస్తృతి కలుగునట్లు ఆమె అనుగ్రహించును.
సాధారణముగా శక్తి, వివేకము ఒకచోట కలిసి ఉండవు.కానీ, రాజరాజేశ్వరీ దేవి అనుగ్రహము కలిగిన యెడల, శక్తి, వివేకము కలిసి మనలో కలిసి ఉండును.దివ్య చైతన్యములో అనేక అనంతములు ఉండును. వాటికి మన మనస్సు తెరచుకొనునట్లు ఆమె చేయును.
విశ్వములో విశాల భావములు వృద్ధి పొందుటకు, ఆమె మనకు సహకరించును.అత్యద్భుతమైన దివ్య జ్ఞానము కలుగవలెనన్ననూ, శాశ్వతమైన దివ్యమాతృశక్తులు మనలోనూ, విశ్వములోనూ ఆవిర్భవించవలెనన్ననూ,స్థిరప్రశాంతిలో మహత్తర కార్యములను సాధింపవలెనన్ననూ,ఆమె అనుగ్రహము అత్యంత ఆవశ్యకము.
రాజరాజేశ్వరీ దేవి అనంతమైన వివేకమునకు ప్రతీక. ఆమె తెలుసుకొనవలెనని సంకల్పించిన ఆమెకు తెలియనిది ఏదీ ఉండదు.సర్వ విషయములను, సర్వ జీవులను, వారి స్వభావములను, వాటిని కదిలించే శక్తులను,
ఈ ప్రపంచము యొక్క ధర్మమును, దానికి సంబంధించిన యోగ్యమైన సమయమును ఆమె అనుగ్రహించగలదు.ఆమెకు పక్షపాతబుద్ది ఎంత మాత్రమూ లేదు.ఆమెకు ఎవరి పట్ల అభిమానము గాని, ద్వేషము గాని ఉండదు. సాధనా బలము వలన భవిష్యత్తు దర్శనమును సంపాదించుకొన్న వారికి ఆమె విశ్వాసపాత్రులుగా పరిగణించి, తన ఆంతరంగీకులుగా స్వీకరించును.
మరిన్ని రాజరాజేశ్వరీ దేవి గురించి రేపు తెలుసుకుందాము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు


0 Comments