Subscribe Us

Header Ads

గమనిక

అంతర్జాలంలో మాకు లభించిన సమాచారాన్ని బట్టి మాకున్న పరిజ్ఞాన్ని జోడించి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఎవ్వర్నీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఇది కేవలం అవగాహనకు మాత్రమే. కొన్ని సందర్భాలలో మేము ప్రచురించే వార్తలు మీకు అంభ్యంతరంగా అనిపిస్తే mohan56.rao @ gmail .com కి రిపోర్ట్ చెయ్యండి. అభ్యర్ధనలు పరిశీలించి సమాచారాన్నిడిలీట్ చేస్తాము.

BREAKING NEWS

శమీ వృక్ష పూజ అంతరార్థం - పరమార్థం

 శమీ వృక్ష పూజ అంతరార్థం - పరమార్థం 

 


మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంతో విరాట నగరానికి వచ్చి నగర పొలిమేరలలో ఉన్న శమీవృక్షం మీద తమ ఆయుధాల నుంచి ఆరాధించి, నమస్కరించి మా ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాల వలె మిత్రులకు పుష్పమాలలు వలె తమకు మాత్రం ఆయుధాలుగా కనబడాలని అపరాజితా దేవిని (దుర్గాదేవిని) ప్రార్థించారు. అజ్ఞాతవాసం అనంతరం ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఆయుధాలను తీసుకుని బయలుదేరిన రోజు ‘విజయదశమి’. సాధారణంగా శమీ వృక్షం గ్రామానికి దూరంగా ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించే ఈనాటికి కూడా విజయదశమి నాడు శమీవృక్షాన్ని దర్శించి, పూజిస్తారు.

శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. పాండవులు  శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.

విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి . పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి . ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

ఇంటికి వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం' అని చెప్పి పెట్టి, వారి దీవెనలందు కోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక. మీరు కూడా ఈరోజు సాయంత్రం శమీపూజ చేసి అపరాజితా దేవి అనుగ్రహాన్ని పొందండి.

శమీ శమయతే పాపం శమీ నాశయతే రిపూన్‌

*శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదమ్*‌  అనే ఈ పద్మపురాణ శ్లోకాన్ని లేదా శమీ వృక్ష పార్ధనా స్తోత్రం శమీ వృక్షం వద్ద పఠించాలి.

*🌴.  శమీ వృక్ష  ప్రార్థనా స్తోత్రం 🌴 *

శమీ శమయ తే పాపం శమీ శత్రు వినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని ॥

శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీం

ఆరోహతు శమీం లక్ష్మీం నృణామాయుష్యవర్ధనీం ॥

నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే
త్వత్తః పత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయీ భవ ॥

ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది
పౌరుషే చాఽప్రతిద్వంద్వశ్చరైనం జహిరావణిమ్ ॥

అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీం
దుస్స్వప్నహారిణీం ధన్యాం ప్రపద్యేఽహం శమీం శుభాం ॥

🪷. మంత్రార్థం 🪷

శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.

🍀. శమీ వృక్ష పార్థనకు సాధనాపర విశిష్టత 🍀

పంచ పాండవులు అనగా శరీరంలో ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు, తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను శమీవృక్షం మీద పెట్టాలి. ‘శమీ’ అనగా శాంతింప చేసేది లేదా నిగ్రహింప చేసేదని అర్థం. మన శరీరంలోని ఏ చిన్న భాగం కదలికయినా బుద్ధి ప్రేరణతోనే జరగాలి. కావున ‘శమీ’ అనగా బుద్ధి, అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు. ‘బుద్ధి’కి నిజమైన ఆయుధాలు ‘ఆలోచనలు’. ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాలులాగా కనబడతాయి. అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములై కాటేసి, భూతాలు వలె భయపెడతాయి కానీ ఆత్మీయులకు పూలమాలలు అవుతాయి. మన బుద్ధే జ్ఞానలక్ష్మి. కావున అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక, విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి అని చెపుకుంటాము. మరొక వ్యాఖ్యానంలో ‘శమీ’ అనగా లక్ష్మీదేవి. బుద్ధి అమ్మయే కావున అమ్మబుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు చేకూరుతాయి.

విజయదశమిని దశహరా అని అన్నాము అనగా పది పాపాలు తొలగించేది . పది ఇంద్రియాలతో చేసే పది పాపాలను తొలగించేది, ఇంద్రియాలతో పాపాలను చేయించేది బుద్ధే కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ అలాగే విజయదశమి నాడు దేవతా వృక్షాలలో ప్రసిద్ధమైన ‘శమీ వృక్షా’న్ని దుష్ట ఆలోచనలను, దురాశలను, దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి.

శమీ వృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సంకేతం. అందరికి మంచి బుద్ధి కలిగి తద్వారా లోకకళ్యాణం జరగాలని శమీపూజ అంతరార్థం.

ప్రసాద్‌ భరధ్వాజ గారి సౌజన్యంతో 

మరిన్ని వివరాల కోసం https://mohansanapala56.blogspot.com/2023/10/blog-post_6.html

Post a Comment

0 Comments