అత్యంత అరుదైన చిత్రం పాల సముద్రం చిలికే సమయంలో నురుగుతో చేసిన " శ్రీ శ్వేత గణపతి / శ్రీ నురుగు గణపతి / శ్రీ శ్వేత వినాయగర్
సముద్ర నురుగుతో తయారుచేసినట్లు చెప్పే వినాయక విగ్రహం ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంది. ఆ విగ్రహం తమిళనాడులో శ్వేత వినాయకర్ పేరుతో పూజలు అందుకొంటూ ఉంది. ఇక్కడ విగ్రహానికి అభిషేకం చేయరు, పూలు, కుంకుమ, పసుపుతో అర్చన చేయరు. వస్త్రాలు కూడా కట్టరు. అంటే ఏవిధంగానూ విగ్రహాన్ని తాకరు. విగ్రహాన్ని తాకకుండా కేవలం పచ్చ కర్పూరం పొడిని విగ్రహం పైకి చల్లుతారు. సముద్ర నురుగుతో తయారు కావడం వల్ల ఆ విగ్రహాన్ని తాకరని చెబుతారు. అదే విధంగా ఈ విగ్రహాన్ని వినాయకచవితి రోజు పూజిస్తే ప్రతి రోజు వినాయక పూజ చేసిన ఫలితం దక్కుతుందని స్థానికులు చెబుతారు. ఇక స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రం పూర్తి వివరాలు మీ కోసం
ఏదైనా కార్యం మొదలుపెట్టే సమయంలో ఖచ్చితంగా విఘ్నరాజైన వినాయకుడికి పూజ చేయాలి. లేదంటే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదన్న విషయం మన పురాణాలు చెబుతాయి.ఇదిలా ఉండగా అమరత్వం కోసం అమృతాన్ని సంపాదించాలని దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మధనం చేసిన విషయం తెలిసిందే. అయితే మొదట అమృతం బదులు హాలహలం వచ్చింది.
ఇందుకు గల కారణాలను అన్వేషిస్తే రాక్షసులతో పాటు దేవతలకు తాము చేసిన తప్పు తెలిసివచ్చింది. దీంతో ఆ పరమశివుడి సూచన మేరకు సముద్ర నురగతో వినాయకుడి విగ్రహం చేసి దానిని పూజించారు.దీంతో అటు పై నిర్విఘ్నంగా వారి కార్యం కొనసాగి చివరికి అమృతం దక్కించుకొన్నారు. అటు పై ఇంద్రుడు ఆ నురుగుతో తయారైన విగ్రహాన్ని తనతో పాటు స్వర్గానికి తీసుకువెళ్లి అక్కడ పూజించేవాడు.
ఇలా కొన్నాళ్లపాటు కొనసాగిన తర్వాత అహల్య వల్ల తనకు గలిగిన శాప నివృత్తికోసం సముద్ర నురుగుతో తయారుచేసిన విగ్రహాన్ని భూమి పైకి తీసుకువచ్చి కొన్ని పవిత్ర ప్రదేశాల్లో ఉంచి పూజలు చేసేవాడు.
ఈ క్రమంలోనే ఒకసారి ప్రస్తుతం కుంభకోణానికి ఇంద్రుడు ఆ నురుగుతో చేసిన ఆ శ్వేత వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వచ్చాడు. ఇక్కడి పవిత్రతకు, వాతావరణానికి ముగ్దుడైన వినాయకుడు ఇక్కడే ఉండిపోవాలనుకొంటాడు.
ఇందుకోసం తన తండ్రి పరమశివుడి సహాయాన్ని కోరుతాడు. దీంతో శివుడు ఒక చిన్నపిల్లాడి రూపంలో అక్కడికి వస్తాడు. అదే సమయంలో ఇంద్రుడికి శివార్చనకు సమయం అవుతుంది.
దీంతో ఆ పిల్లవాడి చేతికి స్వేత వినాయకుడిని ఇచ్చి శివార్చనకు వెలుతాడు. శివార్చన ముగించుకొని వచ్చేదాకా ఆ విగ్రహాన్ని కింద పెట్టకూడదని చెబుతాడు.
అయితే ఇంద్రుడు అలా వెళ్లిన వెంటనే పిల్లవాడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు తన చేతిలో ఉన్న శ్వేత వినాయకుడిని అక్కడ ఉన్న బలిపీఠం కింద పెట్టి వెళ్లి పోయాడు.
తిరిగి వచ్చిన ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ విగ్రహం అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలలేదు. అటు పై దేవ శిల్పిని రప్పించి రథం తయారు చేయిస్తాడు. ఆ రథం పై వినాయకుడు ఉన్న ప్రాంతంతో సహా వినాయకుడిని స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నించి విఫలమవుతాడు.
అదే సమయంలో అశరీరవాణి శ్వేత వినాయకుడు ఇక్కడే ఉండాలని భావిస్తున్నాడని చెబుతుంది. దీంతో ఇంద్రుడు తన ప్రయత్నాన్ని విరమించుకొంటాడు.
అంతేకాకుండా ప్రతి వినాయక చవితికి ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజించాలని తద్వారా ప్రతి రోజూ పూజించిన ఫలితం లభిస్తుందని అశరీర వాని ఇంద్రుడికి సూచిస్తుంది. అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజిస్తాడని భక్తులు నమ్ముతారు.
ఇక ఇక్కడి విగ్రహానికి అభిషేకం చేయరు, పూలు, కుంకుమ, పసుపుతో అర్చన చేయరు. వస్త్రాలు కూడా కట్టరు. అంటే ఏవిధంగానూ విగ్రహాన్ని తకరు. విగ్రహాన్ని తాకకుండా కేవలం పచ్చ కర్పూరం పొడిని విగ్రహం పైకి చల్లుతారు. సముద్ర నురుగుతో తయారు కావడం వల్ల ఆ విగ్రహాన్ని తకరని చెబుతారు.
ఇక ఇక్కడ వినాయకుడు మహావిష్ణువు కళ్ల నుంచి పుట్టిన ఇంద్రదేవి కమలాంబల్, బ్రహ్మ వాక్కు నుంచి పుట్టిన బుద్ధి దేవిని వివాహం చేసుకొన్నారని స్థానిక కథనం. అందువల్లే ఇక్కడ స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
0 Comments