శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో సిద్ధుడు చెపుతున్న విషయాలు తెలుసుకుంటూఉన్నాము. సిద్ధుడు ప్రయాసతో దివ్యబాలకుని అమ్మమ్మ గారి ఇంటికి చేర్చెను.
సిద్ధుడు: ఇంతలో ఆ దివ్యబాలకుని అమ్మమ్మ రాజమాంబ అను పుణ్యమూర్తి బయిటకు వచ్చెను. ఆమె పుణ్యరూపిణీ అను నామాంతరం కలది. ఆమె దర్శనము పొందిన వెంటనే నా శరీరము నందు మంటలు చల్లారినవి.
ఆమె భర్త బాపనార్యులు అని ప్రసిద్ధి పొందిన సత్యఋషీశ్వరులు. వారు నాతో, నాయనా! నీదే గ్రామము? ఎచ్చట నుండి వచ్చితివి? కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనము చేసి వెళ్ళవచ్చును. అని హిందూస్థానీ భాషలో పలికిరి. ఆ నౌకరు, శ్రీపాదుల వారు చేసిన దౌష్ట్యమును వారి అమ్మమ్మకు, తాతగారికి విన్నవించెను.
అంతట శ్రీపాదుల వారు: అమ్మమ్మా! ఈ నౌకరు అబద్ధము చెప్పుచున్నాడు. ఈతనికి రక్తధారలు కారనే కారలేదు. అవి చెమట బిందువులు. నేను అద్దినది మిరపకాయగుండ కానేకాదు. చందనపు పొడి. ఆ నౌకరు పరిశీలించమనెను. పరిశీలించగా శ్రీపాదుల వారు చెప్పినదే నిజమైనది.
అంతట, బాపనార్యులు: శ్రీపాదా! నీవు సత్యవ్రతుడవు. అచ్చట రక్తధారలనిన రక్తధారలు ఉండును. చందనపు పొడి ఉన్నదని అనిన చందనపు పొడి ఉండును. నీవు ఏది ఉన్నదని చెప్పిన యెడల అదియే అచ్చట ఉండును. నీవు సాక్షాత్తు ఉగ్రతారారూపుడవని తోచుచున్నది. ఉగ్రతారాదేవి వాక్సిద్ధిని ప్రసాదించునని వినిఉంటిని.
సాక్షాత్తు ఉగ్రతారవైన నీవు నీ సంకల్పము ప్రకారము అచ్చటనున్న ఏ వస్తువుల స్వభావ ధర్మములైననూ సంకల్పమాత్రమున మార్చగలవు. నీ లీలావినోదమును ఆపి ఈ అభాగ్యుని కరుణింపుము.
శ్రీపాదుల వారు: తాతా! నీవు లెస్సగా పలుకుచున్నావు. నాకు సంకల్పము కలుగుటయు, అది ఫలితము ఇచ్చుటయు, వెంటనే సంభవించునని చెప్పితివి.
ఇది యదార్థమో కాదో నిర్ణయించుటకు శాస్త్రముల సహాయము కావలెను.
ఈ అగంతకుడు సద్బ్రాహ్మణుడు. ఉగ్రతారను ఉపాసించువాడు. మంచిదే! అయితే ఇతడు సన్యాసదీక్షను గురు అనుమతితో పొందక, తనకు తోచిన విధంగా సన్యసించెను. ఇతడి తండ్రి అష్టకష్టములను పడి ఇతనిని పెద్ద చేసెను. ఇతని తల్లి వీడు గర్భము నందు ఉన్నప్పుడు ఎంతయో కష్టమును అనుభవించెను. వీడు జన్మించినప్పుడు ఆ తల్లి తన రక్తమును ఎంతయో పోగొట్టుకొనెను. గాయములు కలిగి రక్తము కారునప్పుడు మిరపకాయ గుండ అద్దిన యెడల ఎంత బాధగా ఉండునో, అంతటి బాధను ఈతని తల్లి అనుభవించినది.
వారు ఇరువురు మరణించి, అదృష్టవశమున పీఠికాపురమున జన్మించిరి. ఆ నరసింహవర్మ ఇంట నున్న నౌకరు ఎవరో కాదు. ఈ ఆగంతకుని పూర్వజన్మము నందలి తండ్రియే! ఆ నౌకరు భార్య పూర్వజన్మమున వీని తల్లియే! చనిపోయిన పెద్దల పేరిట పిండప్రదానములు సరిగా చేయక పోవుట అనర్ధ హేతువు అగును.
ఈ అగంతకుడు తాను సన్యసించితిని కనుక తల్లిదండ్రుల పిండప్రదానములు చేయలేదు. వీని పాపకర్మ, పుణ్యకర్మ పాదగయాక్షేత్రమైన శ్రీపీఠికాపురమునకు లాగుకొని వచ్చినది. స్వల్పబాధతో పాపకర్మమును అనుభవించుట చేత, వీనికి ఈ దుర్యోగములను పరిహరించితిని.
మాతృ గర్భము నందు 9 నెలలు పర్యంతము శిశువు ఉండును. కాశీక్షేత్రము నందు 9 నెలలు గాని, 9 రోజులు గాని, 9 ఘడియలు కాని ఉండిన పితృశాపములు తొలగిపోవును.
శ్రీపీఠికాపురము కాశీతో సమానమైన క్షేత్రము. ఈ అగంతకుడు 9 రోజులు పూర్వజన్మము నందలి తన మాతాపితరులకు సేవ చేసిన యెడల పితృదేవతల శాపములు తొలగిపోవును.
నేను అట్లే చేసితిని. వారి అనుగ్రహ ఆశీర్వాదములు పొందితిని. వారు ఆనాడు ఒసంగిన కాలి అందెలను నా పూజా గృహమున భద్రపరచితిని. నేను ఉగ్రతారాసిద్ధిని పొందితిని. నా యొక్క తంత్రశక్తితో జనులకు ఆధివ్యాధులను పరిహరించుచుంటిని.
మీరు ఇచ్చటకు వచ్చుటకు ముందు శ్రీపాదుల వారు నా మనోనేత్రమునకు అగుపడి, శంకరభట్టు, ధర్మగుప్తులు అనువారు ఈ దారి వెంట వచ్చుచున్నారని, వారికి సమృద్ధిగా భోజనము పెట్టీ, ఆ రోజు నీ ఆశ్రమమున ఉండుటకు ఏర్పాట్లు చేసి నా కాలి అందెలను వారికి బహుమానంగా ఈయవలసినది అని ఆదేశించిరి.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏
0 Comments