దేవతల చేతిలో ఆయుధాలు ఎందుకు ?
అంత శక్తిమంతులు ఆ దేవుళ్ళు అయితే వారికి ఆయుధాలు ఎందుకు?
అసలు మన దేవీదేవతలు చతుర్భుజులుగా, అష్టభుజులుగా కనబడడం వెనుక వారి చేతుల్లో రకరకాల ఆయుధాలు, పుష్పాలు, ముద్రలు ఉండడం వెనుక చాలా అర్ధం అంతరార్ధం ఉన్నాయి.
ఒకొక్క దేవతామూర్తి వారు చూపే రక్షణ అనుగ్రహాన్ని బట్టి వారి వారి ఆయుధాలు ఉంటాయని శాస్త్రవచనం. ఆ మాటకొస్తే తమ భక్తులను అనుగ్రహించాలంటే దేవునికి ఆయుధాలు అక్కర్లేదు,
సంకల్పమాత్రం చేత దుష్టశిక్షణ, శిష్టరక్షణ చెయ్యగల సమర్ధుడు,
మరొక అడుగు ముందుకేస్తే అసలు నిర్గుణ నిరాకారుడైన ఆయన రూపంతో అవతారం కూడా స్వీకరించనక్కర్లేదు.దేవీదేవతలు ఆయా రూపాలలో దర్శనం ఇవ్వడం మనలాంటి అల్పజ్ఞానులకు,నిదర్శనం చూస్తె తప్ప నమ్మని మనబోటి పామరుల కోసమే.
అర్చామూర్తులు కొందరు జ్ఞానులకు ఋషులకు ఆ రూపంలో దర్శనం అనుగ్రహించగా లేదా
వారిని ఆ రూపంలో రక్షించగా వారు దయతో మనకోసం ఆ రూపాన్ని వర్ణించి చూపారు. మరి కొన్ని చోట్ల ఆ దేవతామూర్తులే స్వయంగా వ్యక్తమయ్యారు ఆ రూపాలలో.వారి వివిధ భంగిమలకు, వారి చేతి ముద్రలకుఎన్నో అర్ధాలు చెబుతారు పండితులు.
1. వారి అరచేయి ఆశీర్వాదం ఇస్తున్నట్టుకిందకు చూపుతూ ఉంటె నిన్ను నేను కాపాడుతాను రా అని అభయం ఇస్తున్నట్టు
2. వారి చేయి పూర్తిగా విప్పారి ఆశీర్వదిస్తున్నట్టు ఉంటె నీకు భయం లేదురా నిన్ను నేను చూసు కుంటా,ఏమాత్రం భయ పడవలదు అని చెప్పినట్టు
3. చిన్ముద్రలో ఉంటె నిన్ను అజ్ఞానం నుండి తీసి నిన్ను సరైన దారిలో నడిపిస్తాను అని అభయం ఇచ్చినట్టు
4. ఒక కాలు ఎత్తి నించున్న భంగిమ నిన్నుఈ సంసార సాగరాన్ని దాటించి ముక్తిని ఇస్తాను
అని చెప్పినట్టు
5. అమ్మవారిలా రెండు చేతులో వారి హృదయానికి దగ్గరగా ఉంచితే నిన్ను అక్కున చేర్చుకుని నీకు జ్ఞానమిచ్చి నిన్ను ధర్మం వైపు నడిపించి నిన్ను చూసుకుంటాను అని ప్రేమతో చెప్పినట్టు
6. తిరుమలలో ఉన్నట్టు స్వామి వారు కటిహస్తం ఉంచితే ఒరేయ్ ఈ సంసారమనే సాగరం
నీ కటి వరకే వస్తుంది, నా పాదాలను నమ్ముకుని నేను చెప్పినట్టు ఉన్నవాడిని ఇలా నడిపించి
ఈ భవసాగరాన్ని దాటిస్తాను అని చెప్పినట్టు
ఇలా ఎన్నో భంగిమలకు,వారి అభయ హస్తాలకు ఎన్నో అర్ధాలు గోచరిస్తాయి, అన్నింటిలో కూడా భక్తుని రక్షించే ఆర్తత్రాణపరాయణత్వం కనబడుతూ ఉంటుంది.
మూర్తులు ప్రధానంగా 3 రకాల రూపాలలో అనుగ్రహిస్తూ కనబడతారు.
1. శాంతం. ప్రశాంత వదనంతో ద్విభుజులుగా లేక చతుర్భుజులుగా దర్శనం ఇస్తూ ఉంటారు
2. వీరం..రెండు కానీ నాలుగు కానీ ఆరు భుజాలతో వీర రసం ఒలికిస్తూ దుష్టశిక్షణ, శిష్ట రక్షణను నిర్దేశిస్తూ కనిపించే విగ్రహాలు
3. ఉగ్రం..ఆరు కానీ, 8 కానీ 18 కానీ భుజాలతో ఉగ్రమూర్తులు. దుష్టశిక్షణ ప్రధానంగా కనిపించే
ఈ అర్చామూర్తులు పూజా విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
కానీ మనకు ఎక్కువగా చతుర్భుజులుగా ఉన్న అర్చామూర్తులు దర్శనం ఇస్తూ ఉంటారు.
ఆ నాలుగు భుజాలు ఉండడానికి కూడా ఎన్నో ప్రత్యేక కారణాలు ఉన్నాయి.ఆ నాలుగు చేతులు మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయి.
1. నీకున్న నాలుగు దిక్కులలో నిన్ను రక్షించే తత్త్వం నాది
2. జాగ్రద్, స్వప్న, సుషుప్త, తురీయావస్థలలో నిన్ను వెన్నంటి ఉన్న తత్త్వం నాది
3. చాతుర్వర్ణం నా సృష్టి. అందరినీ రక్షించే బాధ్యత నాది.
4. నీకున్న నాలుగు ఆశ్రమాలలో నిన్ను కనిపెట్టి ఉంటాను
5. మనస్సు, బుద్ధి అహంకార చిత్ అవస్థలలో నిన్ను చూస్తూ ఉన్నాను
6. ధర్మార్ధకామ మోక్షాలు అనే నాలుగు పురుషార్ధాలు ప్రసాదించేది నేనే
7. ఆహవనీయ, గార్హపత్య అనే నాలుగు అగ్నులునా ఆధీనం
8. నాలుగు మార్గాలు నన్ను చేరేవి ఇలా ఎన్నో తత్త్వాలు చెబుతాయి.
ఇక వారు మనకు అభయమిచ్చే వారి ఆయుధాల అంతరార్ధం గురించి.
1. శంఖం..ఓంకారమే వేదం.ఆ శబ్దబ్రహ్మాన్ని నేనే అని చెబుతుంది.అలాగే శంఖం లోనున్న జీవిని రక్షించినట్టునిన్ను ప్రేమతో ఆర్ద్రతలో రక్షించుకుంటాను.నువ్వు కూడా నీ చుట్టు పక్కల వారితో
ప్రేమగా ఉండు అని బోధిస్తుంది
2. గద..ఈ ప్రపంచాన్ని అంతా తన శక్తితో నడిపిస్తున్నాను, నీలో మోహ మదమాత్సర్యాలను ఈ గదతో మోది తరిమి నిన్ను ఈ గద ధరించినట్టు ధరిస్తాను అని చెబుతుంది
3. చక్రం..ఈ ప్రపంచాన్ని ఈ చక్రం తిప్పినట్టు తిప్పుతానుఈ ప్రపంచం అంతా కాల స్వరూపం
అది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది.అది తిరిగినా తిరగని నేను కాలాతీతుడిని. ఈ కాలాన్ని నియంత్రించే సర్వేశ్వరుడిని,నన్ను నమ్ముకుంటే నీలో ఉన్న దుర్గుణాలను తీసి నిన్ను ఈ జననమరణాల చక్రభ్రమణం నుండి ఆవలకు తీసుకుపోగల వాడను అని అభయం ఇస్తుంది
4. తామర పువ్వును పట్టుకున్న నా చేతిని చూసి నీమీద నా చల్లని చూపు వుంటుంది,నువ్వు కూడా తామర పువ్వులా నీ చుట్టు ఎంత పంకం ఉన్నా నన్ను ధ్యానించి దానిమధ్యలో ఆ పంకం అంటని తామర్పువ్వులా వికసించుఅని దీవిస్తుంది
5. ఖడ్గం..రక్షోసురాణాం కఠినోగ్ర...అన్నట్టు మనలో పేరుకుపోయిన ఆసురీ లక్షణాలను,కామం, మోహం అంటే భయంకర నువ్వుమైన అంతఃశత్రువులను తరిగి పోగులు పెట్టి మనల్ని రక్షించే ఆయుధం ద్వారానిన్ను వైరాగ్యమనే ఖడ్గంతో ఏది నిలిచేది ఏది నిలవనిది అని నీకు చెప్పి ఉద్ధరిస్తాను అని నీకు రక్షణ ఇచ్చే తత్త్వం చెబుతుంది
6. త్రిశూలం..నిన్ను భూత భవిష్యద్ వర్తమానాలకు ఆవల తీసుకు వెళ్ళగలను అని, సత్వ రజో తమో గుణాలకు ఆవల ఉన్న తత్త్వం నాది అని, ధర్మ, అర్ధ కామాలను ఈ ప్రపంచంలో ఇచ్చి ఆ పైన మోక్షాన్ని అనుగ్రహించగలిగిన వాడను నేను అని చెప్పే తత్త్వం
7. అంకుశం/ఖట్వాంగ.. నిన్ను పక్కదారి పట్టిస్తున్న కోరికలను అంకుశంతో తొక్కి నిన్ను ధర్మ మార్గం వైపు నడిపిస్తాను అని చెబుతుంది
8. పాశం..నువ్వు ఎక్కడున్నా నిన్ను ఈ పాశంతో కట్టి నిన్ను ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్ళే బాధ్యత నాది అని అభయం ఇస్తుంది
9. చేతిలో తినే వస్తువులను పట్టుకుని ఉంటె నీ సాధన ద్వారా శాశ్వతమైన అమ్రుతోపమానమైన అద్భుత తినుబండారాలలాగ నీ సాధన సంపత్తి ద్వారా నీకు తగిన ప్రతిఫలం ఇప్పిస్తాను అని అభయం ఇచ్చునది
10. పట్టిశం..నిన్ను ఏది ఆపుతున్నదో దాన్ని నేను తీసి వస్తాను అని చెప్పేది, అవిద్య, కర్మ, వాసనలను పోగొట్టి నిన్ను మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా నిన్ను సంపూర్ణంగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పేది
11. చురి.. ఈ ఆధ్యాత్మిక మార్గం చాలా పదునైనది, దీన్ని చాలా జాగ్రత్తగా అనుష్టించాలి, అటు ఇటు అయినా తేగాగలదు అని చెప్పేది
12. వీణ.. అంతర్గత ఆధ్యాత్మిక సంగీత మాధుర్యం. నీకున్న వెన్నులో 24 ఈ వీణలో ఉన్న చిర్రలు, నీ శరీరంతో ఆధ్యాత్మిక సాధన ద్వారా ఈ పిండాండం నుండి ఆ బ్రహ్మాండం ఆవలకు తీసుకుపోగల సామర్ధ్యం నీకు అనుగ్రహించేది నేనే అని అభయం ఇస్తుంది
13. కమండలం. ఎవరికి ఏది కావాలన్నా అన్నా ఈ నిండు కుండ లాంటి కమండలం లో ఉంది,
అడిగినవారికి అర్హతను బట్టి అనుగ్రహించగలను అని అభయం
14. డమరుకం.. రెండు త్రికోణాల కలయికతో చర్మవాద్యం. స్త్రీ పురుష శక్తుల సంయక్తంగా ఈ చర్మం తో పుట్టిన నువ్వు ఈ చర్మ చక్షువులకు ఆవల ఉన్న స్థితికి తీసుకుపోగలవాడను అని చెబుతుంది
15. చాపం/శరం.. నీకున్న జీవిత పరమావధి కోసం నువ్వు కదలని ఏకాగ్రతతో నీ బుద్ధి ద్వారా ఈ శరంలా దూసుకుపో. నీకు చెప్పిన శాస్త్రం ద్వారా జ్ఞానాన్ని గట్టిగా చాపంలా పట్టుకుని ఆ మోక్షం వైపు ఏకాగ్రతతో నీ శరీరాన్ని శరంగా చేసుకుని ఆ మోక్షం వైపు అడుగులు వెయ్యి, నిన్ను పంపే బాధ్యత నాది
16. భిక్ష పాత్ర..నువ్వు అందరిమీద దయగా నడువు, నీకున్న దుర్గుణాన్ని భిక్షగా తీసుకుని నీ కర్మ ధ్వంసం చేసి నిన్ను పైకి తీసుకువెళ్ళగలను. నువ్వు కోరుకుంటున్న ఆ ఉన్నత స్థితిని అనుగ్రహించగలిగే శక్తి నా స్వంతం అని చెబుతుంది. కొన్ని చోట్ల కపాలం పట్టుకుని ఆ రక్తం ఆ భిక్షాపాత్ర లో పడుతున్నట్టు ఉన్న చోట నువ్వు నీ శరీరానికి ఆవల ఉన్న సత్యం గ్రహించు ఈ శరీరం మున్ముందు దాటవలసినదే ఈ మొహాన్ని వదిలి నిన్ను పైకి నడిపిస్తాను అని చెప్పే తత్త్త్వం
17. వజ్రం.. పైకి మూడు కొనలు, కిందకు మూడు కొనలు ఉన్నట్టు ఉండే ఈ వజ్రం నీలో పేరుకుపోయిన అవిద్య ఎంతో కఠినంగా ఉంటుంది, జ్ఞానమే వజ్రంతోనే దాన్ని కోసి నిన్ను ఉద్ధరించగలిగిన శక్తి నాకు ఉంది అని నీకు ధైర్యం చెబుతుంది
18. డాలు/ ఖేటకం.. నీ మీద పడుతున్న పాప దృష్టి, నీ ధర్మవర్తనకు ఎదురుగా వస్తున్నా దుష్టశక్తులనుండి నిన్ను రక్షిస్తాను అని చెబుతుంది. నీమీద పడబోతున్న హానికారక విషయాలను
తరిమి కాపాడే తత్త్వం
19. పరశువు.. నీకు నిత్యానిత్య విచక్షణ జ్ఞానం ఈ పరశువు ద్వారా అనుగ్రహిస్తాను.
మంచిని చేడునుండి చెట్టు నుండి కొమ్మను తీసినట్టు తీసి ఇస్తాను నీకు అని చెప్పే తత్త్వం
20. ఘంట.. ఆసురీ శక్తులు ఘంటానాదం వలన పోయినట్టు నీలో ఉన్న చెడును తరిమి విజయ గంట మోగిస్తాను అని అభయం
21. వరి పైరు.. నీకు ప్రకృతి అనుగ్రహం సమృద్ధిగా అనుగ్రహించే తత్వం
22. చెరుకుగడ.. నన్ను నమ్ముకున్న వారికి చెరుకు లో ఉన్న తీపిగా నీలో ఉన్న శక్తిగా ఉన్నవాడిని/ దానిని అని చెబుతుంది. ప్రకృతి అనుగ్రహం ఈ చెరుకుగడలా నీకు అందచేస్తాను
23. ముద్గరం.. నిన్ను ఒక అద్భుతమైన శిల్పంగా మారుస్తాను అని చెబుతుంది. నీ చుట్టూ ఉన్న సంఘాన్ని నీకు అనుకూలంగా మలుస్తాను అనే అభయం.
24. ధ్వజం..ఉన్నవారిలో నిన్ను చూసి అందరూ గొప్పగా చెప్పుకునేలాగా అన్నింటా ధ్వజం లాంటి స్థితిని కలుగ చేస్తాను అని చెబుతుంది
25. మృగం.. మూర్తి మృగాన్ని పట్టుకున్నట్టు కనిపిస్తే ఈ చరాచరజగత్తు నా ఆధీనం అని, జీవుడులోని దేవుడిని తట్టిలేపే శక్తి నాదే అని చెప్పే విధానం
26. సర్పం..నీలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసే తత్త్వం
27. విభూతి.. ఈ జగత్తు అంతా చివరకు చేరుకోవలసిన స్థితి ఇదేరా అని చెప్పి నిన్ను నిత్యానిత్యవివేచనా చెయ్యమని బోధించే తత్త్వం
28. శుకం.. చిలుక నువ్వు ఏది నేర్పుతావో అదే ఉన్నదున్నట్టు చెప్పే విధంగా నువ్వు నీ గురువు దగ్గర వేదాన్ని అభ్యసించి తరువాత వారికి అందించే విధంగా నిన్ను అనుగ్రహిస్తున్నాను అని చెప్పే తత్త్వం
29. చామరం..ఎంత ఉన్నా నీ గురువుల దగ్గర పెద్దల వద్దనువ్వు అణుకువగా ఉండు అని నేర్పే విధానం
30. చింతామణి..నీ కోరికలను తీర్చే అపర చింతామణి నేనే అని చెప్పే అభయం
31. కుంతలం.. నువ్వు శ్రద్ధగా శాస్త్రాన్ని అనుష్టానం చేస్తే నీ లక్ష్యమైన మోక్షం వైపు తీసుకువెళ్ళే అభయం
32. ఆదర్శం – (అద్దం).. ఈ ప్రపంచం అంతా కేవలం ఈ అద్దంలో చూసిన విధానంగాఅశాశ్వతం,
శాశ్వతమైన స్థితికి తీసుకుపోయే నేనునీకు శాశ్వతం ఏదో, అశాశ్వతం ఏదో బోధించి నీకు జ్ఞానం కలిగించి కాపాడుతాను అని చెబుతుంది
33. జపమాల..108 తులసిపూసలు కానీ/ రుద్రాక్షలు కలిగిన జపమాల నీకు ధ్యానం యొక్క గొప్పదనాన్ని జపం యొక్క విశిష్టతని వివరిస్తూ ఈ లోకంలో పుట్టిన 27 నక్షత్రాల x4 పాదాల లో పుట్టిన జీవులు అందరూ నా చేతిలో మాలలా తిరుగుతూ ఉంటారు, వారిని అందరినీ రక్షించేది నేనే అని చెప్పే తత్త్వం
34. పుస్తకం..నీకు జ్ఞానాన్ని ఒసగే అనుగ్రహం నాది, నువ్వు విన్న చతుర్వేదాలు నా అనుగ్రహం
అని స్పష్టం చేసేది.
ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఆయుధాలు వాటి విశేష తత్త్వం ఆయా శాస్త్రం ప్రకారం చెప్పబడి ఉంది.
భక్తుడికి స్వామి పట్టుకున్న ఆయుధాలు ఎంతో సౌఖ్యాన్ని నమ్మకం కలిగిస్తాయి అభయాన్ని ఇస్తాయి , అదే ఆసురీ తత్త్వం ఉన్న చవటలకు అవి భయపెడతాయి, భయం కలిగిస్తాయి. యద్భావం తద్భవతి అని వారి వారి పరిణతిని బట్టి వారికి ఆ దేవతామూర్తులు కనిపిస్తాయి.భక్తిగా నమ్ముకున్న వారికి ఆనందాన్ని కలిగిస్తాయి ఆ సగుణరూపాలు. వారి అనుగ్రహం మనకు పరి పూర్ణంగా దక్కాలి అని కోరి ప్రార్ధిద్దాం
!!

0 Comments