శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో సిద్ధుడు ఉగ్రతారాదేవి గురించి చెప్తూ, అందెలు ఏ విధముగా అందుకున్నాడు అనేది చెప్పారు కదా!
సిద్ధుడు: నేను కాళీఘట్టముకు పోయితిని. కాళీమాతను దర్శించి దక్షిణమునకు పోయితిని. పూరీ మహాక్షేత్రమును దర్శించితిని. ఇంకనూ దక్షిణమునకు పోయి సింహాచలక్షేత్రమునకు పోయితిని. అదృష్టవశమున పాదగయా క్షేత్రమైన శ్రీపీఠికాపురమునకు వచ్చితిని. శ్రీ కుక్కుటేశ్వరుని దర్శించితిని. నేను స్వయంభూదత్తుని దర్శించితిని.స్వయంభూదత్తుని విగ్రహమున్నచోట ఒక పుట్ట ఉండెను. ఆ పుట్టలో దేవతాసర్పము నివసించుచుండెను. నేను దత్తుని దర్శించిన తదుపరి ఆ దేవతాసర్పం దర్శనమిచ్చినది. ఆ సర్ప దర్శనము వలన నాలోని కుండలినీ విజృంభించ సాగెను. నా శరీరము నా స్వాధీనంలో లేదు.
నేను అటు ఇటు తిరుగుతూ, పిచ్చివాని వలె తారామాత నామొచ్చారణము చేయుచూ బిగ్గరగా అరచు చుంటిని.యోగవశమున నేను సరసింహవర్మ అను పేరు కలిగిన క్షత్రీయు జమీందారు గృహసమీపమునకు వచ్చితిని. మహిషి గ్రామమున దర్శనమిచ్చిన బాలికారూపము నా మనోనేత్రముకు దృగ్గొచరమయ్యెను. వెంటనే ఆ బాలికారూపము, బాలకరూపమును ధరించెను. నాకు ఆనాడు దర్శనమిచ్చిన ఆ దివ్య బాలుడే నా కళ్ళెదుట వాస్తవముగా ఉండెను.
శ్రీ వర్మగారి ఇంట ఒక రకమైన జట్కాబండి వంటిది ఉండెను. ఆ జట్కాబండిని ఒకే ఒక మనుష్యుడు లాగ గలుగును. ఆ దివ్యబాలుడు ఆ జట్కాబండిలో తన మాతామహాగృహమునకు పోదలచెను. శ్రీ వర్మగారు ఆ బండిని లాగు నౌకరును పిలిచెను. ఆ నౌకరు వచ్చి నిలిచెను. ఆ దివ్యబాలుడు నౌకరును కూడా ఆ జట్కాబండిని ఎక్కమనెను.
నన్ను ఆ జట్కాబండిని లాగమనెను. నేను ఆ బండిని లాగనంటిని. నీవు ఈ బండిని లాగని యెడల నీ తోలువలిచి చెప్పులు కుట్టించుకొనెదను. నేను అసలే చర్మకారుడను. తోలువలిచి చెప్పులు కుట్టుకొనుట నా కులవృత్తి. నీలాంటి పశువుల చర్మములు, మహిష, గోచర్మముల కంటే శ్రేష్ఠమైనవిగా ఉండును అనెను.
నేను విధిలేని పరిస్థితులలో ఆ జట్కాబండిని లాగుటకు సమ్మతించితిని. ఆ బాలుడు తన చేతిలో ఎడ్లను తోలు కర్ర వంటిది ఒకటి ధరించిఉండెను. నేను బండిని లాగుటకు నానా శ్రమలు పడుచుంటిని.
ఆ దివ్యబాలుడు తన చేతిలోని కర్రతో నన్ను గట్టిగా బాదుచుండెను. ఆ ఇద్దరు మనుష్యుల బరువును ఇరవైమంది మనుష్యుల బరువుకు సమానమై ఉండెను. నేను బండిలాగుటకు నానావస్థలు పడుచుండగా ఆ బాలుడు నా బాధను అతిశయింపచేయుచూ దుడ్డుకర్రతో మోదుచుండెను. నేను దుఖభారముతో రక్తధారలు కారుచుండగా ఆ బండిని ఎటులనో ఆ బాలకుని మాతామహాగృహమునకు చేర్చితిని.
ఆ బాలకునితో వచ్చిన నౌకరు నా పరిస్థితిని చూచి ఎంతగానో విచలితుడు అయ్యెను. ఆ బాలుడు మాత్రము కర్కశవినోదము నొందెడి కసాయిబాలుడుగా ఉండెను. ఈ దురాత్ముని యందు ప్రేమ భావమును పొందిన యెడల నిన్ను కూడా శిక్షింపవలసి ఉండును అని అతడు ఆ నౌకరును హెచ్చరించెను. నేను అర్ధనగ్న స్వరూపముతో ఉంటిని.
ఆ బాలుడు ఇంటిలోనికి పోయి, హస్తముల నిండుగా మిరపకాయగుండను తీసుకొని రక్తధారలు కారుచున్న నా శరీరభాగములపై దట్టించెను. నా మొల యందు మాత్రము, ఆనాడు మహిషి గ్రామము నందీయబడిన రెండు అందియలు ఉండెను.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏
0 Comments