శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో భాస్కరశాస్త్రి దేవీతత్వం గురించి చెపుతూ, భాస్కరశాస్త్రి: శ్రీపాద శ్రీవల్లభులు మహాసరస్వతీ, మహాలక్ష్మి, మహాకాళీ, రాజరాజేశ్వరీ స్వరూపులు. శ్రీవారిలో ఉన్న దేవీతత్వం అనుష్టానం చేసేవారికి మాత్రమే అర్థమవుతుంది. శంకరభట్టు: పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ వాక్కులు ఉంటాయని విన్నాను. వాటి యొక్క వివరణను కాస్త తెలియజేయవలసినది.
భాస్కరశాస్త్రి: అంబిక వాక్కు ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. ఆమె ప్రతీ మనుష్యుని ద్వారా, ప్రతీ వ్యక్తి లోనూ పలుకుతుంది. బయిటకు వినిపించబడే వాక్కును స్థూల వాక్కు అంటారు.బయిటకు ఏ మాత్రమూ వినిపించకుండా, లోలోపలే ఉంటూ, కేవలము పెదిమల కదలిక లోనే కనిపిస్తూ ఉండే వాక్కును మధ్యమావాక్కు అంటారు.
ఈ మధ్యమావాక్కు కంటే కాస్త సూక్ష్మం గా ఉండే దానిని వైఖరీవాక్కు అంటారు.కంఠగతమైన వాక్కు గొంతు దాకా వస్తుంది. అక్కడ నుండి బయిటకు రాకుండా మధ్యలో ఉండిపోయి మనస్సులో మాత్రమే మెదులుతూ ఉంటే దానిని పశ్యంతీవాక్కు అంటారు. పశ్యంతీవాక్కు కంటే కూడా సూక్ష్మం గా ఉంటూ నాభిలోనే నిర్వికల్పముగా సంకల్పమాత్రమున ఉండే వాక్కును పరావాక్కు అంటారు.
అంబికను త్రిపురభైరవీ గా కూడా ఆరాధిస్తారు. గుణత్రయములు, జగత్త్రయములు, మూర్తిత్రయములు, అవస్థాత్రయములు మొదలగు అన్ని త్రయములకు ఆమె అధీశ్వరి.త్రిపుటిని ఆమె పురత్రయముగా చేసుకొని ఈ మూడులోకాలను పాలిస్తూ ఉంటుంది. మనము శ్రర్ధ కలిగిఉండి, ఆత్మసమర్పణ చేసుకొని, సంపూర్ణ శరణాగతిని చెందితే, ఈ లోకము నుండి గాని, అదృశ్యలోకాల నుండి కానీ, ఎటువంటి శతృత్వం తటస్థపడినా కూడా మనకు కీడు జరగదు.
విరోధీశక్తులు అనేవి కేవలము భౌతిక జగత్తుకే పరిమితం అయినవి కావు. మనకు ప్రాణమయమైన, భౌతికమయమైన, మానసికమైన అంతరాత్మకు సంబంధించిన ఆధ్యాత్మికమైన అస్థిత్వస్థితులు ఉన్నాయి. వీటికి అనుగుణంగానే లోకాలు ఉన్నాయి. మనము తగినంతగా అభివృద్ధి చెందిన యెడల, భౌతికప్రపంచములో ఏ రకముగా జీవిస్తూఉన్నామో, ఆయా లోకాలలో కూడా అలానే జీవించగలము.
మరిన్ని విషయాలు రేపు తెలుసుకుందాము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments