శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శ్రీపాదుల వారు ఏ పరిస్థితులలో పీఠికాపురమును వీడిపోవుట తటస్థించెను అని శంకరభట్టు, భాస్కరశాస్త్రిని ప్రశ్నించెను.
భాస్కరశాస్త్రి: శ్రీపాదుల వారి లీలలు సామాన్య మానవులకు ఊహలకు అందరానివి. ఒకసారి ఒక సన్యాసి కుక్కుటేశ్వర ఆలయమునకు వచ్చెను. అతడు దత్తభక్తుడు. అతడు అందరికీ దత్తదీక్ష ఇచ్చు చుండేవాడు. దత్తదీక్ష పాటించినచో మండలపర్యంతము అనుకున్న కార్యములు సిద్ధించి తీరునని అతడు ప్రకటించెను.
పీఠికాపుర బ్రాహ్మణ్యం కూడా దత్తదీక్షలను స్వీకరించినది. అతడు భూరిదక్షిణలను స్వీకరించు చుండెను. ఆ దక్షిణలలో కొంతభాగమును తన వద్ద దీక్ష తీసుకున్న బ్రాహ్మణ్యమునకు కూడా ఈయబడుచుండెను.బ్రాహ్మణ్యం మాత్రము ఇతర కులస్థులతో, తాము కూడా దీక్షలను తీసుకొని, దీక్షనిచ్చు సన్యాసికి భూరిదక్షిణ ఇచ్చుచుంటిమి అని, కావున మీరు కూడా దీక్షలను తీసుకొని, వారికి భూరిదక్షిణలను ఇచ్చి, జన్మ చరితార్థం చేసికొనుము అని చెప్పుచుండిరి.
బ్రాహ్మణ్యం మాటలను త్రోసిపుచ్చక చాలామంది దీక్షలను స్వీకరించి భూరిదక్షిణలను ఇచ్చు చుండిరి.ఇంతలో దత్తదీక్షలను తీసుకొనుటయా, మానుటయా అని తర్జనభర్జనలు ప్రారంభము కాసాగెను. బ్రాహ్మణ పరిషత్తు, క్షత్రియ పరిషత్తు, వైశ్య పరిషత్తు సంయుక్త సమావేశం జరిగినది. దానికి శ్రీ బాపనార్యులు అధ్యక్షత వహించిరి.
శ్రీ బాపనార్యులు: శ్రీ దత్తుడు అందరివాడు. దీక్షాస్వీకారం అందరూ చేయవచ్చును. అందువలన అష్టాదశవర్ణముల వారు, సన్యాసి నుండి దీక్ష తీసుకొనవచ్చును. దీక్ష స్వీకార అవకాశము సర్వజనులకు ఈయబడవలెను.
అంతట, బ్రాహ్మణ పరిషత్తులో అధిక సంఖ్యాకులు, అయ్యా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఆచారవంతులై ఉందురు. అందువలన వారు దీక్షలను స్వీకరించవచ్చును. శూద్రులు అనాచారవంతులై ఉందురు. అందువలన వారు దీక్షలను స్వీకరించకూడదు. వారి నుండి దక్షిణలు మాత్రము స్వీకరించి, మనము మన తపఃశక్తితో వారిని ఉద్దరించవచ్చును. అనిరి.
బాపనార్యులు: అన్ని కులముల యందు ఆచారవంతులు, అనాచారవంతులు ఉందురు. ఎవరు ఆచారవంతులో, ఎవరు అనాచారవంతులో తేల్చుట కష్టసాధ్యము.అందువలన సామూహిక కళ్యాణమును, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మనము దత్తహోమమును గాని, లేదా తది తరములైన యజ్ఞయాగాది కార్యక్రమములను నిర్వహించి, సాంఘాతిక శ్రేయస్సును సమకూర్చ వలెను.దక్షిణలను మాత్రమే స్వీకరించి దీక్షలను శూద్రులకు ఈయకపోవుట అన్యాయము అని నాకు తోచుచున్నది.దక్షిణలను తీసుకొని మనము మన తపఃశక్తితో శూద్రులను ఉద్దరించ గలిగిన యెడల, తక్కిన బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులను కూడా ఉద్దరించవచ్చును.అట్లే అయినచో, ఏ కులము వారికి ప్రత్యేక దీక్షలను ఈయవలసిన అవసరము లేదు. అదియునూ గాక, దక్షిణ ఈయవలసిన రొక్ఖమును భారీగా నిర్ణయించిరి.అన్ని కులముల యందును బీదవారు ఉందురు. వారు ఇంతటి దక్షిణలను ఈయజాలరు.
రెక్కాడితే గాని డొక్కాడని ధనహీనులు మనకు భారీగా దక్షిణలను ఇచ్చి, అనేక దినములు పస్తు ఉండవలసివచ్చును.దక్షిణ అనునది ఐచ్చికము చేయవలెను. యధాశక్తి సంతోషపూర్వకముగా ఈయబడుదానినే దక్షిణగా తీసుకొనవలెను. అప్పుడు మాత్రమే దత్తుడు సంతోషించును. అని తమ అభిప్రాయమును వెలిబుచ్చారు.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments