శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో నాగేంద్రశాస్త్రి నుండి సెలవు పుచ్చుకొని, శంకర భట్టు, ధర్మ గుప్తులు అనేక సాధనముల గుండా తమ ప్రయాణము కొనసాగించుచుండిరి.
ఒక్కోసారి రెండెడ్ల బండి మీదను, ఇంకొక పర్యాయము గుఱ్ఱపు బండి మీద, ఒకోసారి పాదచారులుగా ప్రయాణము కొనసాగిస్తూ పీఠికాపురము దిశగా వారి ప్రయాణము చేయసాగిరి. కొన్ని దినములు ప్రయాణము తరువాత త్రిపురాంతకం అని పిలువబడే మహాక్షేత్రమును చేరిరి. త్రిపురాంతకేశ్వరుని దర్శించితిరి.
శంకరభట్టుకు దివ్యానుభవము తెలుపవలెనన్న మిక్కుటము అయిన అనుభవములు కలుగుచున్నవి. వారి వద్ద శ్రీచరణుల దివ్య పాదుకలు ఉన్నవి. వారు ప్రయాణము చేయునప్పుడు శ్రీచరణులు వారితోనే ప్రయాణము చేయుచున్నట్లు తోచుచుండేది. వీరు అడుగులు వేయునప్పుడు అవి వీరి అడుగులు కాకుండా, శ్రీచరణుల వారే వీరి శరీరములలో ఉండి అడుగులు వేయుచుండిరి అనునట్లు అనుభవము కలుగుచుండేది.
మాట్లాడినప్పుడు కూడా వీరు ఏమి మాట్లాడుచుండిరో తెలియకుండా శ్రీపాదుల వారే వీరి ద్వారా మాట్లాడించుచుండిరి తోచుచుండేది. వీరి శరీరములలో, మాంసములో, రక్తములో, నాడులలో, సర్వస్వము శ్రీవారు నిండిఉన్నట్లు అనిపించేది. జీవాత్మయే పరమాత్మ అనెడి సిద్ధాంతమును వినిఉంటిరే కాని, శరీరము నందు అంతటను శ్రీచరణుల చైతన్యమే నిండి ఉండి, వారితో ఏ విధమైన స్పర్శ లేకుండా అనుభవము మాత్రమే కలిగించెడి ఈ రకమైన లీలను వారు ఏనాడూ కని విని ఉండలేదు.
త్రిపురాంతకేశ్వరుని అర్చకస్వామి భాస్కరశాస్త్రి. అతడు వీరిని ఎంతగానో అభిమానించెను. అతడు పీఠికాపుర వాస్తవ్యుడు అట. అర్చన చేయుటకై అచ్చట నియమింపబడెను. అతడు షోడశీ రాజరాజేశ్వరి భక్తుడు. శ్రీపీఠికాపుర నివాశిని, శ్రీ కుక్కుటేశ్వర మహాప్రభువుల దేవేరి అయిన శ్రీ రాజరాజేశ్వరీ దేవి స్వప్నమున అతనికి మంత్రదీక్ష ఇచ్చేనట. అతడు వీరిని ఇద్దరినీ తన అతిథులుగా ఉండమని కోరెను. వీరి వద్ద శ్రీపాదుల వారి పాదుకలు ఉన్నవనెడి విషయమును అతడు గ్రహించెను. ఆ పాదుకలను అతని పూజామందిరమున ఉంచిరి.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments