శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో బైరాగి, శ్రీపాదుల వారితో గల అనుబంధాన్ని గురించి చెప్తూఉన్నారు.
బైరాగి: ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్టి గారి ఇంట నున్న ఆవు వట్టిపోయినది. అందుచేత శ్రేష్టి గారి ఇంటికి లక్ష్మి పాలను తెచ్చెడిది. శ్రేష్టి గారి ఇంటికి శ్రీపాదుల వారు తరచుగా వచ్చెడివారు. అమ్మమ్మా! నాకు ఆకలి అగుచున్నది అని వారు అడిగీ అడగక ముందే మహాలక్ష్మి సమానురాలైన వెంకటసుబ్బమ్మ గారు వేడి పాలను కాచి శ్రీపాదుల వారికి ఇచ్చెడిది. అంతే కాకుండా మీగడ, వెన్న కూడా ఇచ్చెడిది.
లక్ష్మి ఆ ఇంటికి పాలు తెచ్చునప్పుడు, శ్రీపాదుల వారు తమకు ఎక్కువగా ఆకలి అగుచున్నది అని చెప్పిరి. వెంకటసుబ్బమ్మ గారు లక్ష్మిని మరికాసిని పాలను తెమ్మనిరి. మరికొంచెం పాలను తెచ్చి ఇచ్చిన యెడల తన ఇంటిలో పాలు తగ్గిపోవును. తాను నీళ్ళ మజ్జిగను త్రాగవలసి వచ్చును. అయిననూ త్యాగశీలి అయిన లక్ష్మి తను త్రాగుటకు, వినియోగించుకొనుటకు దాచుకున్న పాలను కూడా శ్రేష్టి గారి ఇంటికి అమ్మజొచ్చెను.
ఆలయములో పూజాదికములు పది రోజులు జరిగినవి. బ్రాహ్మణులకు భూరి సంభావనలు ఈయబడినవి. అయితే, యక్షిణి ప్రభావమున మహాశూన్యము మిగిలినది. స్వయంపాకములు భూరిపరిమాణంలో ఈయబడినవి. అయితే బ్రాహ్మణులు బలిష్టులు అగుటకు బదులు నీరసంతో కృశించిరి.
ఇంతలో ఆ ఊరికి పురాణ ప్రవచనం చేయు పండితుడు ఒకడు వచ్చెను. కుక్కుటేశ్వర ఆలయము బయిట ఉన్న విశాలప్రాంగణములో పురాణ ప్రవచనమునకు ఏర్పాట్లు చేసిరి. పురాణములు అనునవి శూద్రులకు కోసము గాని, మావంటి బ్రాహ్మణోత్తములకు కాదని, మాకు తెలియని పురాణములు ఎమియునూ లేవని, బ్రాహ్మణోత్తములు చెప్పిరి.
శ్రీ బాపనార్యుల వారు, శ్రేష్టి గారు, వర్మ గారు తమ వంతుగా కొంత ధనమును పురాణము చెప్పు పండితునకు ఇచ్చెదమనిరి. శూద్రులు అందరూ పురాణప్రవచనమునకు వచ్చుటకు అంగీకరింపబడెను.
అప్పుడు శూద్రులు ఆ పురాణము చెప్పు పండితునకు సంభావనలు ఈయవచ్చని దండోరా వేయించబడెను. బ్రాహ్మణులలో కొందరు శూద్రులు పురాణ పండితునకు ఇచ్చు సంభావనలో సగభాగం బ్రాహ్మణపరిషత్తునకు ఇచ్చి సగభాగము అతడు తీసుకోనవచ్చునని సూచించిరి. దానికి శ్రీ బాపనాచార్యులు వారు దీనినే ముష్టిలో ముష్టి వీరముష్టి అందురు. మీరు పురాణ శ్రవణము కూడా చేయనంటిరి. పైగా కష్టపడి ప్రవచనము చేయు పండితుని కష్టార్జితం కూడా హరింపచూచుచుండిరి.
మీరు మీ ప్రవర్తనను, ఆలోచనా విధానములను మార్చుకొనని ఎడల భవిష్యత్తులో కాలపురుషుని వలన తీవ్రశిక్షలను అనుభవించవలసి ఉండునని వారిని మందలించిరి.వచ్చిన పురాణ పండితునకు బాపనార్యుల ఇంట భోజనము ఏర్పాటు చేయబడినది.
పురాణ ప్రవచనమునకు ముందు లక్ష్మి పాలను కాచి వారికి ఇచ్చు చుండెడిది. ఆ పాలను త్రాగి అతడు పురాణ ప్రవచనమును మొదలుపెట్టేవాడు.శ్రీపాద శ్రీవల్లభుల వారు సర్వ హృదయాంతర్వర్తి గనుక వారికి తెలియనిది లేదు.
ఆ పురాణ పండితుడు మహాజ్ఞాని. మహాయోగి. అతడు తన యోగశక్తి వలన, తన ఆత్మ ధరించిన ఇతర రూపములను కనుగొనగలిగెను. ఆ రూపములలోని చైతన్యమును తనలోనికి ఆకర్షించుకొనెను.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments