శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః
బైరాగి: పురాణ పండితుడు ఇప్పుడు ఒక బ్రాహ్మణ జమీందారుల ఇంట ఉన్న నాలుగైదు నెలల పసిబాలునిలో తన ఆత్మను కనుగొనెను. లక్ష్మి తనకు పాలను ఇచ్చు సందర్భమున ఆమెను యోగదృష్టితో చూడగా, తన ఆత్మయే లక్ష్మి మరుజన్మమున లక్ష్మికి భర్తగా ఉండునని తెలుసుకొనెను.
అనగా, ఆ పసిబాలుడే లక్ష్మికి మరుజన్మమున భర్త కాగలడని తెలియుచున్నది.ఆత్మ యొక్క పురుషరూపములన్నియు మూలతత్వముగ ఉన్న ఆ పండితునిలో ఇదివరకే ఐక్యమై ఉన్నవి.తన యొక్క శక్తి రూపములు ఏమైపోయెనా అని యోగదృష్టితో చూడగా, తన స్త్రీ రూపములకు మూలతత్వము లక్ష్మి అని గ్రహించెను. అంతేగాక తన యొక్క స్త్రీతత్వములన్నియు లక్ష్మిలో విలీనమై ఉండుటను కూడా గమనించెను.
లక్ష్మికి తన భర్త యందు మక్కువ మెండు. తన భర్త యొక్క చైతన్యము భూత శరీరమును విడిచిపెట్టి రాలేదని, ఆమెకు అర్థము అయినది. అనేక పర్యాయములు ఆమె తన భర్త యొక్క రూపమును తనకు ప్రక్కగానే నిలిచి ఉండుటను గాంచెను.విరజానది దాటుటకు గోదానము చేయుదురు. గోమాత కూడా తన భర్తను విరజానదిని దాటించి క్షేమముగా భూలోకమున మరొక గోవుగా జన్మించేననియూ తెలుసుకొనెను. కారణము ఏమనగా, ఆమెకు గోమాత కూడా దర్శనమైనది.
విరజానదిని దాటిన లక్ష్మి యొక్క భర్త యొక్క చైతన్యము తన మూలతత్వము అయిన పురాణపండితునిలో లీనమై ఉన్నదనెడి విషయము సర్వజ్ఞులైన శ్రీపాదుల వారికి అవగతము. అయితే, ఆ పండితుడు పీఠికాపురమున ఉన్న కర్మ ఋణానుబంధములను పూర్తి చేసుకొని, వానితో పాటు తన ఆత్మ ధరించిన ఇతర రూపముల కర్మలను కూడా తన యోగశక్తితో హరింపచేసుకొని, పరమేశ్వరునిలో ఐక్యమవవలెనని నిశ్చయించుకొని పీఠికాపురమునకు వచ్చెను.
ఒకవేళ ఆ పండితుడు ఆ విధముగా పరమేశ్వరునిలో ఐక్యమైపోయినచో, ఆ నెలల బాలుడుగా ఉన్న బ్రాహ్మణ జమీందారు పిల్లవాడు కూడా మరణించును. అట్లే అయినచో, ఆ పిల్లవాడే లక్ష్మికి మరుజన్మమున రావలసిన భర్త కావున, లక్ష్మి ఈ జన్మ పూర్తి చేసికొని మరుజన్మ అవతరించునప్పటికీ, తనకి భర్తగా కావలసిన బ్రాహ్మణ బాలుడు మరణించుట వలన, తాను బ్రహ్మచారిణిగా మాత్రమే జీవించి మరణించవలెను.
కానీ, లక్ష్మికి మరుజన్మను పొందవలయును అనెడి కాంక్ష తీవ్రముగా ఉన్నది. అందువలన శరీరపాతానంతరము చైతన్యస్థితి నొందినప్పుడు మరొక సద్బ్రాహ్మణుల ఇంట తాను జన్మించవలెను.
తన భర్త నెలల బాలుడుగా ఉన్న జమీందారుల పాపడు పెరిగి పెద్దవాడై తీరవలెను. పాపము లక్ష్మి అమాయకురాలు! ఆమెకు తెలియకుండానే ఆమె అర్ధనారీశ్వర యోగమును అనుష్టించినది.
ఇదంతయు శ్రీపాదుల వారి లీల.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments