శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో భాస్కర పండితులు శ్రీవిద్యోపాసనలో భాగంగా అనఘాదేవీ యొక్క స్వరూపము, అనఘుని స్వరూపము, అనఘా వ్రతము గురించి చెప్తూ ఉన్నారు.
భాస్కర పండితులు: శ్రీఅనఘాదేవీ యొక్క రూపము లక్ష్మీదేవి. ఆమెలో రాజరాజేశ్వరీ లక్షణాలు, మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నవి.శ్రీ అనఘుని యొక్క రూపము విష్ణువు. ఆయనలో పరమేశ్వరుని లక్షణాలు, త్రిమూర్తుల లక్షణాలు నిండుగా ఉన్నవి. కావున, శ్రీఅనఘాదేవీ సమేత అనఘుని ఆరాధించుట సర్వ శ్రేయోదాయకము.
అనఘాష్టమి వ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసిన వ్రతము.ఈ వ్రతము ఆచరించుట వలన సర్వశుభములు పొందవీలుఅగును.శ్రీపాదుని వైశిష్ట్యం, దత్త ఆరాధనలోని గొప్పతనమును తెలియజేస్తూఉన్నారు.
నాయనలారా! శ్రీ అనఘాదేవీ సమేతుడైన అనఘుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున భువిలో అవతరించి ఉన్నారు.జీవరాశుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక చైతన్యములకు చాలా సన్నిహితుడై ఉన్నాడు. అతడు స్మతృగామీ అనగా, పిలిచిన వెంటనే పలికే స్వభావము కలవాడు.
తన భక్తుల, ఆశ్రితుల కష్టనష్టములను రూపుమాపి ఇహపర సుఖములను ఈయగల సమర్థుడు.దశమహావిద్యలను ఆరాధించుట వలన కలుగు ఫలమును శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించిన దత్తుని ఆరాధించుట వలన వెంటనే కలుగును.వివిధ దేవతలను ఆరాధించుట వలన తప్పకుండా శుభఫలితములు కలుగుచుండును. అయితే, దత్తారాధనము వలన ఆయా దేవతలు ఇచ్చెడి శుభఫలితములు శ్రీఘ్రముగా లభించును.
దత్తుడు సర్వదేవతా స్వరూపుడు, చతుర్యుగ అవతారము, అవతార సమాప్తి లేని మహావతారము అయిన కారణమున ఇది సులభసాధ్యము అయి ఉన్నది.నాయనా! శంకరభట్టు! నీవు రచించెడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అను మహాపవిత్ర గ్రంధమును మహాయోగులు, మహాపురుషులు కూడా అధ్యయనము చేసెదరు. వారు దానిని సంధ్యాభాషకు సంబంధించిన వ్యాకరణ సహాయమున అర్థము చేసుకొనెదరు. వారు పొందు విభూతులు బహు చిత్రవిచిత్రమైనవిగా ఉండును.
భౌతికస్థాయి లోని మనుజులు దీనిని పారాయణము చేసిన యెడల ఇహపర సుఖములను, శుభములను పొందెదరు.ఇది అక్షరసత్యగ్రంధము కనుక దీనిలోని ప్రతీ అక్షరము నందునూ యోగశక్తి నిండిఉండును. ప్రతీ అక్షరము నందును బీజాక్షరశక్తి కలిగిఉండును.ఈ పవిత్ర గ్రంధమును ఏ భాషలో చదివిననూ భక్తిశ్రర్ధలు కలిగి ఉన్నయెడల ఒకే రకమైన ఫలితము ఇచ్చును. ఈ గ్రంథము ఆ మహాప్రభువు అయిన శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అక్షరస్వరూపము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments