శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో భాస్కర పండితులు కాశీ గురించి తెలియపరుస్తూ ఉన్నారు.
శ్రీపాదుల వారు కాశీలో గంగా స్నానం చేసిరి. అంతట గంగామాత ప్రత్యక్షమై, వారిని ప్రతీరోజూ గంగానదిలో స్నానము చేయవలెనని కోరెను. శ్రీపాదుల వారు అటులనే గంగాస్నానం ప్రతీరోజూ చేసెదనని గంగామాతకు వరమిచ్చిరి. గంగామాత యొక్క చైతన్యము కూడా ఇదేవిధముగా పంచకోశములలో ఉండును. అనగా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు ఉండును.
శంకరభట్టు: మహాశయా! గంగామాత జల స్వరూపము కదా! ఆమెకు పంచ కోశములు ఎట్లు ఉండును? నాకు అవగతం అగుట లేదు.భాస్కర పండితులు: నవ్వుతూ, నాయనా! దేవతలు మంత్ర స్వరూపులు. వారు భౌతిక స్వరూపులు కాదు.మంత్రములు అనునవి శబ్దబ్రహ్మము యొక్క శక్తి స్వరూపము.
గంగామాత అనగా, శక్తి రూపమున, చైతన్య రూపమున ఉన్న దేవత అని అర్థము.ఆమె భౌతిక రూపమున ఉన్న గంగానదీ స్వరూపమునకు తాదాత్మ్యస్థితిలో ఉన్న అభిమాన దేవత. అనగా చైతన్య రూపమున ఉన్న దేవత.అదేవిధముగా సూర్య భగవానుడు అనిన యెడల వినువీధిలో కనపడు సూర్యుడు, ఖగోళమునకు తాదాత్మ్యస్థితిలో ఉన్న చైతన్యరూపమైన దేవతాస్వరూపము అని అర్థము.
ఈ ధర్మసూక్ష్మమును, నిగూఢమైన దివ్య రహస్యమును నీవు బాగుగా గుర్తు ఎరుంగవలెను.మానవుల యందు జలతత్వము ఉండును.ఆ జలతత్వమును శుద్ధి చేయుటకు శ్రీపాదుల వారు జల యజ్ఞమును చేయ సంకల్పించిరి.అందువలన ప్రతీదినము శ్రీపాదుల వారు కాశీలో గంగా స్నానము చేయదలచిరి.
ఈ యోగ ప్రక్రియ వలన భౌతిక రూపమున ఉన్న జలావాసములన్నియు పవిత్రీ కరించబడును. పవిత్రమైన నదులన్నియు తమ మాలిన్యాలను పోగొట్టుకొని పవిత్రత నొందును. గంగాది మహా నదులన్నియు పాపభూయిష్ట మానవులు తమ యందు స్నానము చేయుటచే అపవిత్రమగును.
మహా పురుషులు, చైతన్య స్వరూపులు, పుణ్య పురుషులు గనుక ఆయా నదుల యందు స్నానము చేసినప్పుడు ఆయా నదులు తిరిగి పుణ్యవంతములు అగుచుండును.జలయజ్ఞమును శ్రీపాదుల వారు చేయుటలోని అంతరార్థము జీవరాశుల శరీరము లందు రస స్వరూపమున ఉన్న జలతత్వమును శుద్దీకరించుటయే!
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏
0 Comments