రామాయణమ్ 144 - రామాయణమ్ - మారీచుడు హిత బోధ
రావణా ముల్లోకాలలో ఉన్న రాక్షసులకు ఎదో కీడు మూడేటట్లే ఉన్నది .సీత నీ చావుకోసమే పుట్టినట్లున్నది, ఆవిడ మూలాన నాకు కూడా మరణము సంభ వించ వచ్చునేమో!.హాయిగా ,స్వేచ్చగా , నిరంకుశముగా ఇప్పటిదాకా రాజ్యపాలన చేస్తున్నావు , రాక్షసుల సుఖ సంతోషాలు,లంకాపట్టణము నీ యీ చర్య వలన నశిస్తాయేమో అని అనుమానముగా ఉన్నది.
.
నీవు అనుకున్నట్లుగా కౌసల్యా నందనుడు దుష్టుడు,దురాత్ముడు , కఠినుడు, అపండితుడు, ఇంద్రియలోలుడు కాదు.
.
ఆయన తన తండ్రిని కైకేయి మోసము చేయటము చూసి తండ్రిని సత్యవాదిని చేయటము కోసము తన అంత తానుగా అరణ్యానికి వచ్చాడు. ఆయన సకల భూత మనోహరుడు.
.
రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః
రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ
.
రాముడుమూర్తీభవించినధర్మము ,సత్పురుషుడు , సత్యమైన పరాక్రమము కలవాడు, దేవతలకు దేవేంద్రుడు వలెనె సర్వలోకములకు ప్రభువు.
.
సీతమ్మ రాముడి రక్షణలో ఉన్నది సూర్యుడినుండి ఆయన కాంతిని ఎవరైనా అపహరించగలరా?
.
రాముడు ప్రజ్వరిల్లుతున్న నిప్పు ,ఆయన బాణాలు ఎగసే అగ్నికణాలు. తెలిసి, తెలిసి ఆ మంటలలో దూకి బూడిద కాకు.సీత రాముడికి ప్రాణము, ఆవిడ ఎల్లప్పుడూ ఆయననే అనుసరించే వ్రతము కలది ! ఆవిడ మరొక అగ్నిజ్వాల!
.
వ్యర్ధమయ్యే ఈ పనిలోకి ఎందుకు ప్రవేశిస్తావు. రాముడి తేజస్సు ఇంత అని చెప్పటానికి సాధ్యము కాదు.రాముడు ఏనాడైతే రణరంగములో నిన్ను చూస్తాడో ఆనాడే నీకు భూమి మీద నూకలు చెల్లి పోతాయి! రాముడి కన్ను పడనంతవరకే నీ బ్రతుకు. ,హాయిగా పదికాలాలు రాజ్యము చేయాలని అనుకొంటే ఈ పిచ్చి ఆలోచన మానుకో.వెళ్లి విభీషణాదులతో చర్చించి నీ బలమెంతో, రాముని బలమెంతో సరిగా అంచనా వేసుకొని నీ కేది హితమో ఆ పని చెయ్యి.
.
అని మారీచుడు స్పష్టముగా రావణునికి హిత బోధ చేశాడు.ఇంకా రాముడి పరాక్రమము గురించి తన అనుభవము చెప్పసాగాడు.
0 Comments