శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో నరసింహరాయుడు వృత్తాంతం విని, అతను ఇచ్చిన శ్రీపాదుల వారి అక్షతలు తీసుకొని, శ్రీపాదుల వారి ఆజ్ఞ ప్రకారం పీఠికాపురము దిశగా శంకరభట్టు, ధర్మగుప్తుల వారు ప్రయాణం చేస్తూ, శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకుంటూ, మరియొక గ్రామమునకు చేరుకున్నారు.
మార్గమధ్యలో ఎవరో ఒకరు ఆతిథ్యం ఇచ్చుచుండిరి. కొన్నిచోట్ల గుఱ్ఱపుబండిపై, కొన్నిచోట్ల రెండెడ్లబండిపై, కొన్ని సందర్భములలో పాదచారులై, ప్రయాణము సాగించిరి. వారు ఏ విధముగా ప్రయాణము చేసిననూ, మార్గమధ్యమున ఎవరి ఆతిథ్యం స్వీకరించిననూ అదంతయు పరోక్షంగా వీక్షించెడి శ్రీపాద శ్రీవల్లభ లీలావిశేషముగానే భావించిరి. వీరు చేరుకున్న ఆ గ్రామము నందలి విశేషము ఏమనగా,
ఒకానొక బ్రాహ్మణుడి ఇంటిలోని సామాన్లు అంతయూ వీధిలో పడవేయబడుచుండెను. అతని భార్యా పిల్లలు కూడా గృహము వెలుపలనే ఉండిరి. ఆ బ్రాహ్మణుడు ఒక ఋణదాత నుండి కొంత ద్రవ్యమును ఋణముగా పొందిఉండెను. అతడు ఋణమును తీర్చలేకపోయెను.
ఒకనాడు ఋణదాత ఈ బ్రాహ్మణుని సమీపించి నిలువుమని గద్దించెను. అతడు నిలిచెను. ఒక బొగ్గుతో అతని చుట్టూరా ఒక రేఖ గీయబడెను. ఆ రేఖను దాటి బ్రాహ్మణుడు వచ్చుటకు వీలులేదు. ఎన్ని దినములలో ఋణమును తీర్చేదవో యజ్ఞోపవీతమును పట్టుకొని చెప్పవలసింది అని గద్దించెను. రెండు పక్షములలో ఋణము తీర్చేదనని బ్రాహ్మణుడు పలికెను. అనుకున్న విధముగా ద్రవ్యము సర్దుబాటు కాలేదు. అతడు మాటను నిలుపుకొన లేకపోయెను.
గడువు తీరిన పిదప మేము ఇంటిని స్వాధీనపరచుకొనెదమని ఋణదాత ఇదివరకే నిష్కర్షగా చెప్పిఉండెను.అతడు చెప్పినవిధంగా ఈ ఆగడము చేయుచుండెను. బ్రాహ్మణుడు, భార్యాబిడ్డలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిరి.
ఆ ఊరివారు అందరూ చోద్యము చూచుచుండిరే కాని ఒక్కరునూ సాహసించి ఋణదాతకు సర్దిచెప్పి మరికొంత గడువునిమ్మని నచ్చచెప్పలేకపోయిరి. ఆ బ్రాహ్మణుని దీనావస్థను చూచి శ్రీధర్మగుప్తులు వారు విచలితులు అయ్యిరి. వారికి సహాయము చేయవలెననెడి కోరిక కలదు కానీ, ప్రస్తుతము వారి వద్ద ధనము లేదు.
శంకరభట్టు స్వతః నిర్ధనుడే. అయితే సాహసించి, అయ్యా! ఈ అశక్త బ్రాహ్మణుని మీద దయ ఉంచి మరి రెండు పక్షములు వ్యవధి ఇండు. ఈ వ్యవధి లోపల శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహమున అతడు తన కష్టముల నుండి గట్టెక్కును. కాస్త స్థిమితంగా ఆలోచింపుడు. అతడు బాకీ తీర్చుటకు నేను హామీ పడెదను. అని అనెను. ఈ మాటలు శంకరభట్టు అప్రయత్నంగా పలికెను.
ఆ ఋణదాత: సరే! నీ మాటలను నమ్ముచున్నాను. రెండు పక్షములు గడువు నిచ్చుచున్నాను. అయితే, బాకీ పూర్తిగా పరిష్కారమగు నంతవరకూ మీరిద్దరూ కూడా ఇచ్చటనుండి కదలరాదు. ఒకవేళ బాకీ పరిష్కారము కాని యెడల ఈ బ్రాహ్మణుని గృహమును స్వాధీనపరచుకొనుటయే కాక, నా చేత నిష్ప్రయోజనంగా గడువు ఇప్పించినందులకు మిమ్ములను ఇద్దరినీ రచ్చకు ఈడ్చెదను. అప్పుడు న్యాయాధికారి వేయు శిక్షకు మీరిద్దరూ పాత్రులు అగుదురు. అనెను.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏
0 Comments