నేటి మాట శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో నరసింహరాయుడు తన అనుభవాలను శంకరభట్టు, ధర్మ గుప్తుల వారితో పంచుకుంటూఉన్నాడు.
నరసింహరాయుడు: మా రమణి అందాలరాశి కనుక మా ఊరిలోని కాపు యువకులలో ఆమెను పెండ్లాడవలెనని కోరిక మిక్కుటంగా ఉండేది. మా రమణికి నన్ను వివాహము చేసుకొనవలెనని కోరిక కలదు. నాకు ఆస్థిపాస్థులు లేవు. శరీరమా దుర్బలము. పైపెచ్చు పిరికివాడిని.
మా మేనమామ ధనవంతుడు, ఆస్థిపరుడు. మా మేనత్త గయ్యాళి అయిననూ పొగడ్తలకు పొంగి పోయి మోసపోయేడి స్వభావమును కలిగిఉండేది.
మా రమణి శ్రీకృష్ణ భగవానుడి ప్రార్థించుచూ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తన భర్త కావలెనని ప్రార్థించుచుండెడిది.
ఇంతలో మా ఊరికి ఒక దొంగసాధువు వచ్చెను. అతడు కాళీమాతను పూజించుననియు, భూత భవిష్యత్ వర్తమానములను చెప్పగలవాడని ప్రచారము మిక్కుటము కాజొచ్చెను. అతని వద్ద నిజంగానే కొన్ని శక్తులు ఉండెను. ఊరిలోని వారికి అతడు చెప్పు జోస్యము నూటికి నూరుపాళ్ళు సత్యముగా ఉండెను. అతడు మా మేనత్తను తన మాయమాటలతో లోబరచుకొనెను.
అతడు మా ఇంట కాళీపూజను చేయుటకు ఏర్పాట్లు చేయబడెను. మా రమణి ప్రతీరోజూ పూజ చేసుకొను కృష్ణుని మట్టివిగ్రహమును ఆ ఇంటినుండి విసిరివేయ వలెనని అతడు చెప్పెను. మా మేనత్త అంగీకరించినది. మా రమణి భోరుభోరున ఏడ్చినది. కానీ ఫలితము శూన్యము.
ఆ దొంగసాధువు పూజ చేయుటను ప్రారంభించెను. కాళీమాతకు అనేక కోళ్లు బలిగా ఈయబడెను. వాటి రక్తముచే పూజాగృహము అంతయునూ భీభత్సంగా ఉండెను. ఆ ఇంటిలో మానవ కపాలములు, ఇంకనూ మరికొన్ని విచిత్రమైన శ్మశాన సాధనా సామగ్రి ఉంచబడెను.
ఈ పూజాతతంగము అంతయునూ అయిన పిమ్మట ఆ ఇంటిలో ఒకచోట విశేషమైన నిధి నిక్షేపములు లభించుననియు, దానితో కుటుంబము అంతయూ ఐశ్వర్యవంతమగుననియు అతడు ఇంట్లో వారందరినీ నమ్మించెను.
ఆ దొంగసాధువుకు వశీకరణ విద్య కూడా తెలియును. అతడు ఆ విద్య సాయముతో మా రమణి యొక్క సౌశీల్యమును హరింపవలెనని పన్నాగము పన్నెను.
అతడు చేయు చిత్రవిచిత్ర పూజావిశేషముల వలన మా రమణి ఆరోగ్యము క్షీణించుచుండెను. ఆమె పూర్వపు రమణి వలె కాక వింతగా ప్రవర్తింపసాగెను. అర్ధరాత్రి వేళ ఆమె రక్తపానము చేసెడిది. మేకలను, కోళ్లను వధించి ఆ రక్తమును ఆమెకిచ్చుచుండిరి. ఆమె అన్నముకు బదులు రక్తమును మాత్రమే త్రాగుచుండెడిది.
దొంగసాధువు ఆమెలో కాళీమాత ప్రవేశించినది అనియు, అందువలన రక్తము త్రాగు చున్నదనియు, కాళీమాత తొలగిపోగానే ఆమె మామూలు మనిషి అగుననియు, రక్తతర్పణము లేనిదే కాళీ శాంతించదనియు, నిధినిక్షేపములు లభించవనియు నమ్మబలుకుచుండెను.
ఇల్లు అంతయూ నానా భీభత్సంగా ఉండేది. ఉన్నట్లుండి ఆహారపాత్రలు నూతిలో పడు చుండెడివి. ఇంటిలో అక్కడక్కడా మానవ అస్థిపంజరములు కూడా అగుపించేవి. అర్ధరాత్రి వేళ వింత వింత ఆకారములు గోచరించి భయంకరమైన ధ్వనులను చేయుచుండేవి. మా ఇల్లు అంతయూ శ్మశానభూమి వలె ఉండేది.
మా మేనమామ దొంగసాధువును ఇంటినుండి వెడలిపొమ్మని చెప్పునంతటి ధైర్యము కలవాడు కాదు. మా మేనత్త కొద్దిరోజులు ఈ కష్టమును ఓర్చుకొనిన నిధినిక్షేపములు లభించును కదా అని ఆశతో ఉండేది. మొత్తం పరిస్థితి అంతయూ అయోమయముగా, అస్తవ్యస్తంగా తయారైనది.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏
0 Comments