శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శరభేశ్వర శాస్త్రి, తన మాట వమ్ము అయినచో, బ్రాహ్మణుని ఋణము తీర్చుటకు హామీ ఇచ్చేను. మూడురోజుల అనంతరము నాల్గవ రోజు శరభేశ్వరశాస్త్రి చెల్లెలి భర్త దేశాంతరం నుండి క్షేమముగా వచ్చెను.
ఆ బ్రాహ్మణ స్త్రీ ఆనందమునకు అంతులేదు. శంకరభట్టు ఇచ్చిన మంత్రాక్షతలు మూలముగానే ఆమెకు సౌభాగ్యము నిలెచె నని ఆమె తలపోసేను. ఆమె భర్తను దొంగలు మార్గమధ్యలో చంపబోగా ముస్లిం పహిల్వాన్ ఒకడు ఆ దొంగలను సంహరించి ఆ బ్రాహ్మణుని రక్షించెను.ఆహా! శ్రీపాదుల వారి మహిమ అపారము! శరభేశ్వరశాస్త్రిలో అహంకారము నశించెను.
శంకరభట్టు జోస్యం నిజమైన కారణమున బ్రాహ్మణుని ఋణమును శరభేశ్వరశాస్త్రి తీర్చివైచెను.శరభేశ్వరుడు, శంకరభట్టును, ధర్మగుప్తుల వారిని, తమ ఇంట ఆతిథ్యమును స్వీకరించవలసినది అని కోరెను. వల్లె యంటిరి.
శరభేశ్వరుడు, అయ్యా! దశమహావిద్యలలో ఒకటైన ధూమావతీ దేవిని నేను ఆరాధించువాడను. తంత్ర గ్రంథముల ప్రకారము ఆమె ఉగ్రతారయే! ఆమె ప్రసన్న అయిన యెడల రోగ శోకములను నాశనము చేయును.
కుపిత అయిన యెడల సర్వసుఖములను, కామనలను నాశనము చేయును. ఈమెకు శరణాగతి చెందుట వలన విపత్తులు నాశనమై సంపదలు లభించును. ఆమెకు కోపము కలిగిన యెడల క్షుత్పిపాసలు, కలహములు, దారిద్య్రములు సంభవించును. నేను ఆ మహాతల్లి అనుగ్రహమును పొందితిని. ఉచ్ఛాటన, మారణాదులను ఆ మహాతల్లి నివారించును. చేతబడి మొదలైన వాటిచే బాధపడు జనులను రక్షించుటకు ఈమె ఉపాసన అనివార్యము.
జనులకు హితకరముగా ఉండునట్లు నేను కొన్నాళ్ళు ధనకాంక్షారహితుడనై ప్రవర్తించి ఉంటిని. ఆపైన నేను ధనకాంక్ష కలిగిన వాడినై ఉచ్చాటన, మారణాదులను పొందిన వారి నుండి ధనమును విశేషముగా ఆకర్షించుచుంటిని.ఇది ఆ మహాతల్లికి సమ్మతము కాదాయెను. మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏
0 Comments