శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శ్రీపాదుల వారు, వేదాంతశర్మ మరియు అతని భార్య యొక్క జన్మ రహస్యాలను చెప్పిరి. బ్రాహ్మణ పరిషత్తు యొక్క ఆంతర్యమును తెలియజెప్పిరి.పరిషత్తు అంతయూ నివ్వెర పోయినది. అందరునూ చూచుచుండగానే, ఒక జ్యోతి స్వరూపము వేదాంతశర్మలో కలిసిపోయినది.
శ్రీపాదుల వారు: మీ కళ్లెదుటే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంతశర్మలో కలిసినది. ఈతడు బ్రాహ్మణుడగునో, చండాలుడగునో మీరే నిర్ణయింపుడు. మమ్ము కుల బహిష్కృతులను చేసి శంకరాచార్యుల వారి మెప్పు పొందుటకు మీరు ప్రయత్నించిరి. శంకరాచార్యుడు నన్నేమి చేయును.మీ కళ్లెదుటే పుట్టి, పెరిగి, తాతగారి వద్దగానీ, నాన్నగారి వద్దకాని వేదమును ఎంత మాత్రమూ చదువక నేను వేదఋక్కులను వల్లించగలుగుచున్నాను.
ఒకే పర్యాయము అనేక స్థలముల యందు దర్శనము ఇచ్చుచున్నాను.శంకరాచార్యుల వారే ఎదురయిననూ నాకేమీ భయము? వారు నిత్యము ఆరాధించు శ్రీశారదాచంద్రమౌళీశ్వరునిగా దర్శనమిచ్చి అనుగ్రహించెదను. అప్పుడు వారు విధి లేక నన్ను దైవమని అంగీకరింపవలసివచ్చును. వారి నిర్ణయము అప్పుడు మీకు మరింత బాధాకరమగును.
క్షత్రియ పరిషత్తు, వైశ్య పరిషత్తు మీ నిర్ణయములకు తలొగ్గజాలవు. పౌరోహిత్యములను, కర్మకాండలను, సంభావనలను వారు నిలుపుచేసిన యెడల మీరు పిల్లాపాపలతో నకనకలాడవలసి వచ్చును. నాతో తగాదా పెట్టుకొనిన ఎడల సర్వనాశనమును కొనితెచ్చుకున్న వారగుదురు. నేను చతురాశ్రమ ధర్మములను నిర్వర్తింపవలెనని చెప్పుచున్నాను. అష్టాదశ వర్ణముల వారు సుఖసంతోషములతో జీవించవలెనని చెప్పుచున్నాను.
మీరు ధర్మకర్మలను సమర్థవంతంగా నిర్వహించి, ధర్మసంస్థాపనలో పాల్గొనుడు. అట్లు కానియెడల కష్టనష్టములకు లోనయ్యేదరు. నేను ప్రశాంతముగానే ఉందును. కానీ మీరే అస్తవ్యస్త పరిస్థితుల పాలయ్యెదరు.
ప్రకృతి యందు పరిణామములు జరుగునప్పుడు రెండే రెండు పద్దతులు ఉండును. ఒకటి సరిచేయు పద్దతి. రెండు సరి చేయబడు పద్దతి.సరి చేయబడుటకు చాలా వ్యవధి ఈయబడును. మీరు సరిచేయబడుటకు సమ్మతించని యెడల వినాశనమును ఆహ్వానించుటయే అగును. వినాశనము చేసి అయిననూ ధర్మమును స్థాపించెదను. అని నిష్కర్షగా చెప్పిరి.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments