శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో వేందాంతశర్మ, బంగారయ్యగా మారి బంగారమ్మను తీసుకొని గ్రామాం తరములు అన్నియునూ ప్రయాణించుచూ, శంకర భట్టు, శ్రీధర్మ గుప్తుల వారు కలిసినచోట ఆశ్రమమును నిర్మించు కొని, ఆ ఆశ్రమము నందు మాతంగీమాతను ప్రతిష్టించుకొని జీవించుచుండిరి.
బంగారయ్య: శ్రీపాదుల వారు ఈ మార్గమున కురుంగడ్డకు పొవుచూ మా ఆశ్రమమునకు వచ్చి, మమ్ములను ఆశీర్వదించి, *శరీర పాతానంతరము నీవు తిరిగి ఋణానుబంధ రీత్యా బ్రాహ్మణజన్మను ఎత్తెదవు. బంగారమ్మ ఋణానుబంధ రీత్యా శూద్రజన్మను ఎత్తును. అప్పుడు మీరు ఇద్దరు భార్యాభర్తలు అయ్యెదరు. మీకు సంతానము కలుగును. మీ సంతానము వారలు కురుంగడ్డ యందలి నన్ను అర్చించు భాగ్యమును పొందెదరు. మీకు సుఖము కలుగుగాక!* అని దీవించిరి.
అయ్యా! ఇది మా వృత్తాంతం. అని శ్రీపాదుల వారితో వారికి గల అనుబంధ విషయములను వివరించెను. మీరు ఈ ప్రాంతము నుండి పయనించుచుందురు అనియు, మీ వద్ద శ్రీపాదుల వారి కాలిఅందెలు కలవనియు, వానిని తీసుకొని, చర్మపాదుకలను శంకరభట్టుకు, ధర్మగుప్తునకు ఈయవలసినది అనియు వారు మమ్ములను ఆదేశించిరి.
మేము ఆరాధించునది మతంగముని కన్యక అయిన మాతంగిదేవిని. ఈ మహాతల్లిని ఆరాధించిన యెడల, దాంపత్యసౌఖ్యము విశేషముగా ఉండును. ఈమెను రాజమాతంగి, కర్ణమాతంగి అను రకముల పేర్లతో పిలిచెదరు.
ఒక పర్యాయము శ్రీపాదుల వారు మా ఆశ్రమమున భౌతికంగా దర్శనము ఇచ్చారు. ఆ సమయమున బంగారమ్మ పాలను వెచ్చబెట్టు చుండెను. ఈ చర్మపాదుకలకు మూలాధారమైన గోమాత ఆ సమయమున తన శిరస్సును ఆడించుచూ మా ముందు నుండే వెళ్లిపోయినట్లు దర్శనమాయెను. శ్రీపాదుల వారు మా నుండి పాలను స్వీకరించిరి.
మేము ఆరాధించు మాతంగిదేవి విగ్రహము తమ పేరిట ఏర్పడు మహాసంస్థానము నందు ఔదుంబరవృక్షం కింద అనేక గజముల లోతుకు చేరుననియు, అచ్చట చాలామంది సిద్ధపురుషులచే సేవింపబడుననియు సెలవిచ్చిరి. బంగారమ్మను పిలిచి ఇట్లు అనిరి. అమ్మా! నీ భర్త బహుయోగ్యుడు. రాబోవు జన్మమున ఇతనితో సర్వసుఖములను పొందుము. నీకు బంగారుబొట్టును సిద్ధపరచి ఉంచితిని. నీకు అత్యంత శుభప్రదమైన మంగళసూత్రమును తయారుచేయించితిని. అవి హిరణ్యలోకము నందు భద్రపరచబడి ఉన్నవి. ఉత్తర జన్మమున స్వయముగా నేనే మీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ వివాహము చేసెదను.
అయ్యలారా! మీరు మా గాథను వింటిరి కదా!
సదా సిద్ధమంగళాస్తోత్రమును చేయుచుండుడు. మహాపురుషుల అనుగ్రహము తప్పక కలుగు చుండును. సిద్ధులు, మహాసిద్ధులు, మహాయోగులు, అందరునూ శ్రీపాదుల వారికి కరచరణాద్యవయువముల వంటివారు. వారి ద్వారా శ్రీపాదుల వారు తమ సంకల్పమును నెరవేర్చెదరు. ఒక పర్యాయము వారు రాజమాతంగిదేవీ రూపమున దర్శనమిచ్చి అనుగ్రహించిరి. సమస్త సృష్టియునూ, దాని రహస్యమంతయునూ వారి కరస్థమైఉన్నది. మీరు సదా వారిని స్మరించండి. ధ్యానించండి. అర్చన చేయండి. సర్వసిద్ధులు వారే! వారు కన్నతల్లి వలె మిమ్ములను కాపాడుదురు. తమ భక్తుల యందు శ్రీపాదుల వారి ప్రేమ కోటితల్లుల ప్రేమకంటే మెండుగా ఉండును.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments