శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో శంకరభట్టు, ధర్మగుప్తుల వారు, ఛిన్నమస్తాదేవి గురించి అనుభవపూర్వకంగా తెలుసుకొని, తిరిగి పీఠికాపురము దిశగా వారి ప్రయాణము మొదలుపెట్టారు.
దారిలో ఒక బైరాగి తారసపడ్డాడు. అతడు ఒక రావిచెట్టు మొదలులో కూర్చొనిఉన్నాడు. అతని కన్నులు తేజస్వంతములై ఉండెను. వీరి దగ్గరకి చేరినప్పుడు, అతడు, మీరు శంకరభట్టు, ధర్మగుప్తుడునే కదా అని ప్రశ్నించెను. వీరు అవును అంటిరి. ఈ రావిచెట్టు మొదట్లో కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అనెను.
మీ వద్ద శ్రీపాద శ్రీవల్లభుల వారి చర్మపాదుకలు ఉండెను కదా అని ప్రశ్నించెను. వీరు అవునంటిరి. మీరు ఆ చర్మపాదుకలను నాకు ఇచ్చి, నా వద్ద ఉన్న కాలనాగు యొక్క మణిని స్వీకరించండి అని అనెను. వీరు సరే అంటిరి.
శంకరభట్టు: బైరాగితో, అయ్యా! నేను శ్రీవారి దివ్యచరిత్రను వ్రాయు సంకల్పములో ఉండగా, శ్రీపాదుల వారి జీవితములో ఒక్కొక్క సంవత్సరములోనూ జరిగిన ఒక్కొక్క సంఘటనము చెప్పు శ్రీచరణుల భక్తులు తారసపడుచున్నారు. దీనికి కారణము ఏమై ఉండును అని ప్రశ్నించెను.
బైరాగి: శ్రీపాదుల వారు ఆదిభైరవీ, ఆదిభైరవుల సంయుక్త స్వరూపము. కాలమును శాసించు కాలభైరవులు కూడా వారే! వారు కాలస్వరూపులు. కాలపురుషుడు కంటే భిన్నుడు కాదు. వారు మహాకాలస్వరూపము.ఎప్పుడు ఏ సంఘటనను కలిగించవలెనో వారికే ఎరుక. అందుచేత అవ్యక్తమైన శ్రీపాదుల వారి సంకల్పస్వరూపము పసిగట్టుటకు దేశకాలములలో బందీలుగా ఉన్న ఏ జీవికి సాధ్యము కాదు.
దేశకాలములలో ఆడుకొనుట వారికి బంతిక్రీడ వంటిది.జీవుల వికాసక్రమము, ఆయా జీవుల స్వభావములు, వాటి ధర్మములు, వాటి కర్మములు, వాటి ఫలితములు, వాటి ప్రభావములు అన్నియునూ వారి ఆధీనము. మహాపండితుని అని గర్వించువారిని, తృటిలో వారు అజ్ఞానులుగా మార్చగలరు. మహా అజ్ఞానుని సమస్త వేదవేదాంగములు తెలిసిన మహా పండితునిగా మార్చగలరు.
శ్రీపాదుల వారిది యోగసంపన్న అవతారము.శ్రీపాదుల వారిని అవతారపురుషునిగా, సాక్షాత్తు దత్తప్రభువుగా గుర్తించుటకు ఎంతయో పాపరాశి దగ్ధం కావలెను. ఎంతయో పుణ్యము గుట్టలు గుట్టలుగా పడి ఉండవలెను. ఇది సాధారణ నియమము.
అయితే, శ్రీపాదుల వారి కృపా కటాక్షములు కలిగిన యెడల ఈ సాధారణ నియమములకు అతీతంగా శ్రీపాదుల వారు భక్తసంరక్షణను చేయుదురు. వారు క్షణ క్షణ లీలావిహారి.శ్రీవల్లభుల వారి చరితామృతమును అధ్యయనము చేయువారికి ఒక క్రమమైన పద్దతిలో వికాసకార్యక్రమము జరుగుచుండును.
అందువలననే, శ్రీపాదుల వారి జీవితము నందలి ఒక్కొక్క సంవత్సరములోని కేవలము ఒకటి, రెండు లీలలు మాత్రమే నీకు తెలియజేయబడుటయు, అవి కూడా క్రమానుగతముగా తెలియజేయబడుటయు శ్రీపాదుల వారి దివ్యలీలలోని అంతర్భాగము.
వారు కేవలము ఒక్క భూగోళము యొక్క వికాసము కొరకే అవతరించారని అనుకొనుట పొరపాటు. అనేక కోటి బ్రహ్మాండములు అనుక్షణమూ సృష్టి స్థితి లయముల నందుచున్నవి.వాటిలోని పరిణామ క్రమమంతయూ సదా శ్రీపాదుల వారి హస్తగతమై ఉన్నది. శ్రీపాదుల వారి దివ్యనేత్రముల కనుగొలకుల యందు కోటానుకోట్ల బ్రహ్మాండములు వృద్ధిక్షయములు పొందుచుండును.
ఇదియే శ్రీపాదుల వారి నిజతత్వము.అసలు నిరాకారమైన ఆ పరతత్వము, అవ్యక్తము నందు ఏ స్థితిలో ఉన్నదో కూడా తెలియరాని ఆ మహాతత్వము నరాకారముగా, పీఠికాపురములో అవతరించుటయే ఒక దివ్యలీల.అవతరించిన పిదప జరుపు లీలలకు అంతెక్కడిది. వేదములు కూడా శ్రీపాదుల వారి గురించి వర్ణించి మౌనము వహించినవి.
శ్రీపాదుల వారి జ్ఞానము అనంతము. వేదముల జ్ఞానము పరిమితము. శ్రీపాదుల వారి శక్తి అనంతము. కరుణ అనంతము. శ్రీపాదుల వారు అన్ని దేశముల యందును, అన్ని కాలముల యందును కూడా ఉందురు. శ్రీపాదుల వారు సత్యమునకు సత్యము. జ్ఞానమునకు జ్ఞానము. అనంతమునకు కూడా అందరాని మహాఅనంతము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments