శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో దశమహావిద్యలలో ఛిన్నమస్తా గురించి తెలుసుకుంటూఉన్నాము. యోగినీమాత శంకరభట్టును, ధర్మగుప్తులను, శంకరమ్మ, దర్మమ్మలుగా మార్చివేసిరి.
యోగినీలు పూజ ప్రారంభం చేసిరి. కాగడాలు వెలిగించబడినవి. భయభ్రాంతులను కలిగించునట్లు నృత్యములు చేయబడుచుండెను.యోగినీమాత: కబంధము అనునది పరివర్తనశీలమైన జగత్తునకు అధిపతి. ఆ శక్తినే ఛిన్నమస్తాదేవి అని అందురు.
ఈ జగత్తు నందు వృద్ధిక్షయములు సదా సాగుచూనే ఉండును. క్షీణత్వము తగ్గిన యెడల వికాసము యొక్క స్థాయి అధికమగును.అప్పుడే భువనేశ్వరీదేవి అనునది ప్రకటించబడుచుండును. దీనికి విరుద్ధముగా క్షీణత్వము అధికమైన యెడల వృద్ధిస్థాయి తగ్గినప్పుడు ఛిన్నమస్తాదేవి ప్రాధాన్యము వహించును.
ఆ మహామాత యొక్క స్వరూపము అత్యంత రహస్యమైనది.ఒకానొక సమయమున పార్వతీదేవి తన సఖురాడ్రతో మందాకినీ నదికి స్నానమునకు వెళ్ళినది. స్నానాంతరమున ఆకలిచే పీడింపబడినది. అందుచేత ఆమె కృష్ణపర్ణ అయినది.
ఆ సమయమున ఆమె చెలికత్తెలు భోజనమును అడిగిరి. ఆమె మరి కొంచెం సమయము ఆగమని చెప్పినది. కొంత సమయము తరువాత తిరిగి వారు భోజనార్థమై అడిగిరి. ఆమె మరికొంత తడవు ఆగమని చెప్పినది. ఈ రకముగా కొన్నిసార్లు జరిగినది.
అంతట, ఆ మహాదేవి తన ఖడ్గముతో శిరస్సును ఖండించుకొనినది. దాని నుండి మూడు రక్తధారలు ఎగసిపడినవి. రెండు ధారలను ఆమె సఖురాండ్రు పానము చేయగా, ఒక ధారను దేవి స్వయముగా పానము చేసినది.అర్ధరాత్రి సమయము నందు ఛిన్నమస్తాదేవి ఉపాసన చాలా మంచి ఫలితము నిచ్చును.శతృ విజయమునకు, శతృ సమూహాలను స్థంబింప చేయుటకు, రాజ్యప్రాప్తికి, దుర్లభమైన మోక్షప్రాప్తికి ఆమెను ఉపాసింపవలెను.దిశలే మహాతల్లికి వస్త్రములు. ఆమె నాభిలో యోని చక్రము ఉన్నది.
కృష్ణ (తమస్సు), రక్త (రజస్సు) గుణములు కలిగిన సఖురాండ్రు ఆమెతో సదా ఉందురు. ఆమె తన శిరస్సును ఖండించి కూడా సజీవంగా ఉండుట యోగభాషలో పరిపూర్ణ అంతర్ముఖత్వమునకు ప్రతీక. అగ్ని స్థానమైన మణిపూరకములో ఛిన్నమస్తను ధ్యానిస్తారు. హిరణ్యకశిపునికి ఈమె ఉపాస్యదేవత.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు🙏


0 Comments